Payyavula Keshav: రెండేళ్లుగా శ్రీవారి లడ్డూల్లో కల్తీ నెయ్యి.. తెలిసినా వైసీపీ ప్రభుత్వం మౌనంగా ఉంది: పయ్యావుల

Payyavula Keshav alleges adulteration in Tirumala laddu ghee during YCP rule
  • తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడి
  • ఈ వ్యవహారం తెలిసినా గత వైసీపీ ప్రభుత్వం నివేదికను తొక్కిపెట్టిందని ఆరోపణ
  • నెయ్యిలో చేపల నూనె, జంతు కొవ్వు కలిసినట్లు ఎన్‌డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని వెల్లడి
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో భారీగా కల్తీ జరిగిందని, ఈ విషయం తెలిసినా గత వైసీపీ ప్రభుత్వం వాస్తవాలను తొక్కిపెట్టిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశంలో గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో సమావేశం ముగిసిన అనంతరం కూటమి నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ, ప్రజలకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ విషయాలను బయటపెడుతున్నట్లు స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యత తగ్గిందని, నెయ్యి మంచి వాసన రావడం లేదని భక్తుల నుంచి విస్తృతంగా ఫిర్యాదులు వచ్చాయని పయ్యావుల గుర్తుచేశారు. పోటు కార్మికులు సైతం నెయ్యి నూనెలా జారిపోతోందని చెప్పినా, అప్పటి పాలకులు దాన్ని ఆర్గానిక్ నెయ్యి అంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు.. అనుమానంతో నాలుగు ట్యాంకర్ల నెయ్యి శాంపిళ్లను గుజరాత్‌లోని నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డీడీబీ) ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపారని వివరించారు.

ఎన్‌డీడీబీ ఇచ్చిన నివేదికలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని పయ్యావుల తెలిపారు. ఆ నెయ్యిలో సోయాబీన్, సన్‌ఫ్లవర్, చేపల నూనె, కొబ్బరి నూనె, పామాయిల్, వెజిటెబుల్ ఆయిల్ వంటివి కలిపినట్లు నివేదిక స్పష్టం చేసిందని అన్నారు. అంతటితో ఆగకుండా అందులో జంతు కొవ్వు కూడా కలిసినట్లు తేలిందని, ఇది అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 

"భోలేబాబా డెయిరీలో తయారైన ఈ పదార్థానికి నెయ్యి అని పేరుపెట్టారు. దానికి నెయ్యి వాసన, రూపం వచ్చేందుకు రకరకాల రసాయనాలు కలిపారు. 2022లో మొదలైన ఈ నేరం 2024 వరకు నిరాటంకంగా కొనసాగింది. ఇదంతా తెలిసినా గత ప్రభుత్వం ఈ నివేదికను తొక్కిపెట్టింది" అని పయ్యావుల ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు.


More Telugu News

Payyavula Keshav
Tirumala laddu
TTD
Tirupati laddu
Fake ghee
Adulterated ghee
YS Jagan
Andhra Pradesh government
Tirumala
Scam