Gold prices: బంగారం, వెండి దిగుమతి సుంకం తగ్గింపు.. అయినా రికార్డు స్థాయికి ధరలు!

Gold Prices Hit Record High Despite Import Duty Cut
షార్ట్స్‌లో చూడండి
దేశీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో పసిడి ధరలు బుధవారం దేశ రాజధానిలో భారీగా పెరిగాయి. కేవలం ఒక్కరోజే 10 గ్రాముల బంగారంపై రూ. 7,400 పెరగడం ఇన్వెస్టర్లను సైతం విస్మయానికి గురిచేస్తోంది. దీంతో పది గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో రూ. 1,65,100కు చేరుకుంది. ఇక వెండి కూడా అదే బాటలో పయనిస్తూ కిలోకు ఏకంగా రూ. 14,300 పెరిగి రూ. 2,98,300 వద్ద ట్రేడ్ అవుతోంది.

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై ఇన్వెస్టర్లు మక్కువ చూపుతున్నారు. ఫలితంగా గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర మళ్లీ 5,000 డాలర్ల మార్కును దాటేసింది.

మరోవైపు, దేశీయంగా దిగుమతిదారులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి దిగుమతులకు ప్రామాణికంగా తీసుకునే 'నోషనల్ వాల్యూ'ను (కనీస అంచనా విలువ) తగ్గించింది. 10 గ్రాముల బంగారంపై ఈ విలువను 1,568 డాలర్ల నుంచి 1,518 డాలర్లకు, అలాగే కిలో వెండిపై 3,457 డాలర్ల నుంచి 2,657 డాలర్లకు కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తగ్గింపు కేవలం బంగారం కడ్డీలు, నాణేలు, బిస్కెట్లకు మాత్రమే వర్తిస్తుందని, ఆభరణాల దిగుమతులకు కాదని స్పష్టం చేసింది. సాధారణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ ధరలను బట్టి ప్రభుత్వం ఈ విలువను సవరిస్తూ ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల దిగుమతి సుంకం భారం కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరల కారణంగా వినియోగదారుడికి మాత్రం పసిడి సెగ తప్పలేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  
Go Back to Shorts
Gold prices
Gold import duty
Silver prices
Silver import duty
India gold market
Iran tensions
US Iran conflict
Global gold rates
Rupee dollar rate
Commodity market

More Telugu News