Roshan: రూ.26 వేలకే కారు అంటూ ప్రకటన.. పోటెత్తిన జనాలు.. చేతులెత్తేసిన వ్యాపారి!

Roshan Announces Car for Rs 26000 Faces Public Fury
  • మల్లాపూర్‌కు చెందిన వ్యాపారి రోషన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటన
  • తన వద్ద 50 కార్లు ఉన్నాయంటూ ప్రకటన
  • కారు రూ.26 వేలకే ఇస్తానని ఆఫర్
  • దుకాణం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న జనాలు
  • వ్యాపారి 10 కార్లే ఉన్నాయని చెప్పడంతో దుకాణంపై రాళ్లతో దాడి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రూ.26 వేలకే కారు అమ్ముతామని ప్రకటించిన ఒక పాత కార్ల వ్యాపారి, తన దుకాణం వద్దకు పెద్ద ఎత్తున జనాలు తరలిరావడంతో చేతులెత్తేశాడు. వ్యాపారి మోసం చేశాడని గ్రహించిన జనాలు దుకాణాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మల్లాపూర్‌కు చెందిన రోషన్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రూ.26 వేలకే కార్లు విక్రయిస్తానని సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు. తన వద్ద ఉన్న 50 కార్లను ఇదే ధరకు విక్రయిస్తానని పేర్కొన్నాడు. దీంతో ఈరోజు తెల్లవారుజాము నుంచే ఆయన నిర్వహిస్తున్న దుకాణం వద్దకు పెద్ద ఎత్తున స్థానికులు, దూర ప్రాంతాల నుంచి జనాలు తరలివచ్చారు. వ్యాపారి చాలాసేపటి వరకు రాకపోవడంతో అక్కడకు చేరుకున్న వారు ఆగ్రహానికి గురయ్యారు.

అనంతరం అక్కడకు వచ్చిన రోషన్ తన వద్ద 10 కార్లు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు అక్కడున్న కార్లపై రాళ్లతో దాడి చేశారు. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని వ్యాపారిపై కేసు నమోదు చేసి నాచారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Roshan
Republic Day Offer
Hyderabad
Nachaaram
Car Sale
Fraud
Public Outburst
MallaPur

More Telugu News