Donald Trump: భారత్‌తో మాది చారిత్రక బంధం: రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్

Donald Trump Greets India on Republic Day
  •  నేడు భారత రిపబ్లిక్ డే
  • ప్రపంచంలోనే పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య చారిత్రక బంధం ఉందన్న ట్రంప్
  • భారతీయులకు విషెస్ చెప్పిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
  • ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళతామని వెల్లడి
భారత్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రభుత్వానికి, ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా అమెరికా, భారత్‌ల మధ్య చారిత్రాత్మక బంధం ఉందని ఆయన కొనియాడారు. సోమవారం ట్రంప్ సందేశాన్ని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో పంచుకుంది. "మీ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికా ప్రజల తరఫున భారత ప్రభుత్వానికి, ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు" అని ట్రంప్ తన సందేశంలో పేర్కొన్నారు.

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా భారత ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రానున్న ఏడాదిలో ఉమ్మడి లక్ష్యాల సాధనకు కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు ఆయన ఆకాంక్షించారు. "రక్షణ, ఇంధనం, కీలక ఖనిజాలు, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగాల్లో మన మధ్య బలమైన సహకారం ఉంది. క్వాడ్ వేదికగా బహుళస్థాయి భాగస్వామ్యంతో ఇరు దేశాలకు, ఇండో-పసిఫిక్ ప్రాంతానికి ప్రయోజనం చేకూరుతోంది" అని రూబియో తన ప్రకటనలో వివరించారు.

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి, దేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజుకు గుర్తుగా ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య సంప్రదాయాలను చాటుతూ దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ పరేడ్, దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తారు.


Donald Trump
India Republic Day
Republic Day
India US relations
Marco Rubio
US Embassy India
India
United States
Indian Constitution
democracy

More Telugu News