Telangana Transport Department: తెలంగాణలో అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ విధానం.. తొలి రోజు 490 వాహనాలకు రిజిస్ట్రేషన్

Telangana Transport Department New Vehicle Registration at Showrooms
  • కొత్త వ్యక్తిగత వాహనాలకు షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషన్
  • ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పాయని హర్షం
  • వాణిజ్య, పాత వాహనాలకు మాత్రం పాత విధానమే వర్తింపు
తెలంగాణలో కొత్త వాహనాల కొనుగోలుదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ (ఆర్‌టీఏ) కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాహనం కొనుగోలు చేసిన షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. పౌరులకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.

ఈ కొత్త విధానంలో వాహనం కొనుగోలు చేసిన వెంటనే డీలర్లే సేల్స్ సర్టిఫికేట్ (ఫారం 21), రోడ్ వర్తీనెస్ సర్టిఫికేట్ (ఫారం 22), ఇన్సూరెన్స్, ఇతర పత్రాలను ప్రభుత్వ 'వాహన్' పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. రవాణా శాఖ అధికారులు ఆ వివరాలను పరిశీలించి, వెంటనే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కేటాయిస్తారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సీ) కార్డు నేరుగా స్పీడ్ పోస్టు ద్వారా యజమాని చిరునామాకు చేరుకుంటుంది. ఈ విధానం ప్రస్తుతం వ్యక్తిగత అవసరాలకు వినియోగించే కార్లు, ద్విచక్ర వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. వాణిజ్య వాహనాలు, పాత వాహనాల రిజిస్ట్రేషన్ బదిలీలకు యథావిధిగా ఆర్‌టీఏ కార్యాలయాలకే వెళ్లాల్సి ఉంటుంది.

శనివారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 490 వాహనాల రిజిస్ట్రేషన్ ఈ పద్ధతిలో పూర్తయింది. తొలిరోజు కొన్నిచోట్ల పెట్రోల్ వాహనాల విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తినా, ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్లు వేగంగా జరిగాయి. ఈ విధానంపై వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. "మధ్యాహ్నం 12 గంటలకు వివరాలు నమోదు చేయగా, సాయంత్రం 6 గంటలకు రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చింది" అని హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఒకరు తన అనుభవాన్ని పంచుకున్నారు.
Telangana Transport Department
Vehicle Registration
RTA
Vahan portal
New Vehicle Registration Policy
Telangana RTA
Vehicle Registration Process
Online Vehicle Registration
Telangana Government
Transport Department

More Telugu News