Kurnool Doctor Case: ప్రియుడి భార్యకు వైరస్ ఇంజెక్షన్ ఇచ్చిన మహిళ

Kurnool Doctor Case Woman Injects Doctor with Virus
  • ప్రియుడి భార్యకు హెచ్ఐవీ వైరస్ ఇంజక్షన్ ఇచ్చిన వైనం
  • కర్నూలులో ఘటన 
  • సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు
  • మాజీ ప్రియురాలితో పాటు మరో నలుగురు అరెస్టు
తాను ప్రేమించిన వ్యక్తి వేరొకరిని వివాహం చేసుకున్నాడనే ఆగ్రహంతో, అతని భార్యను లక్ష్యంగా చేసుకుని ఓ మాజీ ప్రియురాలు దారుణానికి ఒడిగట్టిన ఘటన కర్నూలు నగరంలో సంచలనం రేపింది. ఈ మేరకు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కర్నూలుకు చెందిన ఒక వైద్యుడు ఆదోనికి చెందిన యువతితో కొంతకాలం ప్రేమ వ్యవహారం కొనసాగించి, ఆ తరువాత విడిపోయారు. అనంతరం ఆ వైద్యుడు మరో మహిళా వైద్యురాలిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన భార్య కర్నూలు వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తుండగా, ఆయన కర్నూలులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, తాను ప్రేమించిన వ్యక్తి మరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన మాజీ ప్రియురాలు, ఆ దంపతులను విడదీయాలనే దురుద్దేశంతో పథకం పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో, ఈ నెల 9న విధులను ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి వెళుతున్న మహిళా వైద్యురాలిపై నలుగురు వ్యక్తులతో దాడి చేయించినట్లు విచారణలో తేలింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఆమెను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి కింద పడేసిన నిందితులు, సహాయం చేస్తున్నట్లు నటిస్తూ ఆటోలో ఎక్కించి ఒక వైరస్ (హెచ్‌ఐవీ) ఇంజెక్షన్ ఇచ్చినట్లు డీఎస్పీ తెలిపారు.

ఈ ఘటనపై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కర్నూలు 3వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి, మాజీ ప్రియురాలితో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ బాబు ప్రసాద్ వెల్లడించారు. ఈ ఘటన నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
Kurnool Doctor Case
Kurnool
Adoni
Love affair
HIV injection
Crime news
Andhra Pradesh crime
Doctor attack
DSP Babu Prasad
Kurnool news

More Telugu News