Nara Lokesh: అమరావతి ఒక నమ్మకం... సీఎన్ఎన్-న్యూస్18 కథనంపై మంత్రి లోకేశ్ స్పందన

Nara Lokesh Praises CNN News18 Story on Amaravati
  • అమరావతి కేవలం నిర్మాణం కాదని, అదొక నమ్మకమని చెప్పిన లోకేశ్
  • అమరావతిపై గ్రౌండ్ రిపోర్ట్ ప్రసారం చేసిన సీఎన్ఎన్‌కు ప్రశంసలు
  • అన్ని కోణాలను చూపించారంటూ జర్నలిస్ట్ రోహిణి స్వామికి అభినందనలు
  • రైతుల కష్టాలు, గృహ సముదాయాలను కథనంలో చూపించారని వెల్లడి
  • ఏపీ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అమరావతి ప్రతిరూపమని వ్యాఖ్య
రాష్ట్ర రాజధాని అమరావతి కేవలం ఓ నిర్మాణ గాథ కాదని, అదొక నమ్మకమని ఏపీ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. అమరావతిపై ప్రముఖ జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్-న్యూస్18 ప్రసారం చేసిన ప్రత్యేక కథనాన్ని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. కృష్ణా నది ఒడ్డున సుస్థిరమైన, ప్రజాకేంద్రీకృత, పచ్చని, ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలనేది తమ దార్శనికత అని లోకేశ్ పేర్కొన్నారు.

అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, అలాగే ఈ ప్రాంత రైతుల కలలకు ప్రతిరూపమని ఆయన అభివర్ణించారు. అమరావతికి సంబంధించిన అన్ని కోణాలను తమ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వాస్తవాలను వెలుగులోకి తెచ్చినందుకు సీఎన్ఎన్-న్యూస్18 బృందానికి, జర్నలిస్ట్ రోహిణి స్వామికి లోకేశ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కథనంలో రాజధాని కోసం రైతులు పడిన కష్టాలను, వారి పోరాటాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారని ఆయన అన్నారు. అదే సమయంలో, ప్రస్తుతం నిర్మాణం పూర్తిచేసుకుని అందుబాటులోకి వస్తున్న గృహ సముదాయాల ప్రత్యేక ఫుటేజీని కూడా ప్రసారం చేశారని ప్రస్తావించారు. ఈ ప్రత్యేక కథనాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాలని ఆయన సూచించారు.
Nara Lokesh
Amaravati
Andhra Pradesh
AP Capital
CNN News18
Rohini Swamy
Farmers
Capital City
Green City
Sustainable City

More Telugu News