UPI: జపాన్‌లోనూ మన యూపీఐ సేవలు... భారత పర్యాటకులకు శుభవార్త!

UPI Expanding to Japan for Indian Tourists
  • జపాన్‌లోనూ త్వరలో యూపీఐ చెల్లింపుల సేవలు
  • పెరుగుతున్న భారత పర్యాటకుల కోసం కీలక నిర్ణయం
  • ఎన్‌పీసీఐతో కలిసి ఎన్‌టీటీ డేటా ట్రయల్స్ నిర్వహణ
  • 2026 ఆర్థిక సంవత్సరం నుంచి సేవలు ప్రారంభించే యోచన
భారతదేశపు విజయవంతమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) తన సేవలను మరో దేశానికి విస్తరించనుంది. నిక్కీ ఆసియా నివేదిక ప్రకారం, త్వరలో జపాన్‌లో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం జపాన్‌కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ ఎన్‌టీటీ డేటా... నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

జపాన్‌కు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో వారికి చెల్లింపులను సులభతరం చేయడమే ఈ చర్య ముఖ్య ఉద్దేశం. 2025లో సుమారు 3.15 లక్షల మంది భారతీయులు జపాన్‌ను సందర్శించారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 35 శాతం అధికం. ఈ క్రమంలో, 2026 ఆర్థిక సంవత్సరంలో జపాన్‌లో యూపీఐ ట్రయల్స్ నిర్వహించాలని ఎన్‌టీటీ డేటా, ఎన్‌పీసీఐ ప్రణాళికలు రచిస్తున్నాయి.

ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే, భారత పర్యాటకులు జపాన్‌లోని దుకాణాల్లో తమ యూపీఐ యాప్‌ల ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నేరుగా చెల్లింపులు చేయవచ్చు. ఈ మొత్తం వారి భారత బ్యాంకు ఖాతాల నుంచి డెబిట్ అవుతుంది. భారత్, జపాన్ పేమెంట్ నెట్‌వర్క్‌లను అనుసంధానించే ప్రక్రియపై ఇరు సంస్థలు పనిచేస్తున్నాయి.

2016లో ప్రారంభమైన యూపీఐ, భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందింది. ఇప్పటికే భూటాన్, సింగపూర్, ఫ్రాన్స్, యూఏఈ సహా 8 దేశాల్లో యూపీఐ సేవలను ప్రవేశపెట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్‌గా అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) యూపీఐని అభివర్ణించిన విషయం తెలిసిందే.
UPI
Unified Payments Interface
Japan
NPCI
National Payments Corporation of India
NTT Data
India
Digital Payments
Indian Tourists
QR Code

More Telugu News