Bangalore: ప్రపంచంలో రెండో అత్యంత రద్దీ నగరంగా బెంగళూరు

Bangalore Ranked Second Most Congested City Globally
  • టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2025 నివేదికలో వెల్లడి
  • 10 కిలోమీటర్ల ప్రయాణానికి సగటున 36 నిమిషాల సమయం
  • రద్దీ వేళల్లో వాహనదారులు ఏటా 168 గంటలు కోల్పోతున్న వైనం
  • జాబితాలో పుణె 5, ముంబై 18, ఢిల్లీ 23వ స్థానంలో ...
ట్రాఫిక్ రద్దీలో బెంగళూరు నగరం మరోసారి తన స్థానాన్ని దిగజార్చుకుంది. ప్రపంచంలోనే రెండో అత్యంత రద్దీ నగరంగా నిలిచింది. నెదర్లాండ్స్‌కు చెందిన లొకేషన్ టెక్నాలజీ సంస్థ టామ్‌టామ్ (TomTom) విడుదల చేసిన 2025 ట్రాఫిక్ ఇండెక్స్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ఈ జాబితాలో మెక్సికో సిటీ మొదటి స్థానంలో ఉండగా, ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మూడో స్థానంలో నిలిచింది.

నివేదిక ప్రకారం 2025లో బెంగళూరు నగరంలో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి సగటున 36 నిమిషాల 9 సెకన్ల సమయం పట్టింది. ఇది 2024తో పోలిస్తే 2 నిమిషాల 4 సెకన్లు అధికం. రద్దీ సమయాల్లో వాహనదారులు 2025లో ఏకంగా 168 గంటలు (సుమారు 7 రోజులు) ట్రాఫిక్‌లోనే గడిపినట్లు తేలింది. 2024తో పోలిస్తే ఇది దాదాపు 13 గంటలు ఎక్కువ కావడం గమనార్హం.

2023లో ఆరో స్థానంలో, 2024లో మూడో స్థానంలో ఉన్న బెంగళూరు, 2025 నాటికి రెండో స్థానానికి దిగజారింది. రద్దీ వేళల్లో సగటు వాహన వేగం గంటకు 13.9 కిలోమీటర్లకు పడిపోయింది. ఈ జాబితాలో భారత్‌కు చెందిన పుణె (5), ముంబై (18), న్యూఢిల్లీ (23) వంటి నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లోని 387 నగరాల్లో కార్ నావిగేషన్ సిస్టమ్స్, స్మార్ట్‌ఫోన్ల నుంచి సేకరించిన డేటా ఆధారంగా టామ్‌టామ్ ఈ ర్యాంకులను ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో ట్రాఫిక్ మరింత దిగజారినట్లు నివేదిక పేర్కొంది.
Bangalore
Bangalore traffic
TomTom Traffic Index
Mexico City
Dublin
India traffic
Pune
Mumbai
New Delhi
Traffic congestion

More Telugu News