Amazon: అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. సంస్థ‌ చరిత్రలోనే అతిపెద్ద తొలగింపు ప్రక్రియ

Amazon to Announce Second Round of Layoffs
  • అమెజాన్‌లో రెండో విడత ఉద్యోగాల తొలగింపునకు సన్నాహాలు
  • మొత్తం 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తగ్గించుకోవాలని లక్ష్యం
  • వచ్చే వారం నుంచే రెండో విడత కోతలు ప్రారంభమయ్యే అవకాశం
  • ఏఐ, కంపెనీ కల్చర్ మార్పులే కారణాలుగా చెబుతున్న యాజమాన్యం
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. మొత్తం 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తగ్గించుకోవాలన్న లక్ష్యంలో భాగంగా వచ్చే వారం రెండో విడత తొలగింపు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈసారి కూడా దాదాపు 15,000 మందిని తొలగించే అవకాశం ఉందని సమాచారం.

ఈ లేఆఫ్స్ ప్రభావం అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), రిటైల్, ప్రైమ్ వీడియో, హ్యూమన్ రిసోర్సెస్ (పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ) విభాగాలపై పడనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ ప్రణాళికల్లో మార్పులు ఉండొచ్చని కూడా పేర్కొన్నాయి. గతేడాది అక్టోబర్‌లో అమెజాన్ సుమారు 14,000 మంది ఉద్యోగులను తొలగించింది. వారికి కల్పించిన 90 రోజుల గడువు సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో మంగళవారం నుంచే కొత్త లేఆఫ్స్ ప్రక్రియ మొదలుకావచ్చని అంచనా వేస్తున్నారు.

గత తొలగింపుల సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పెరుగుదలే కారణమని కంపెనీ అంతర్గతంగా తెలిపింది. అయితే, సీఈఓ ఆండీ జెస్సీ మాత్రం ఇది ఆర్థిక లేదా ఏఐ ప్రేరేపిత నిర్ణయం కాదని, కంపెనీలో పెరిగిన బ్యూరోక్రసీని, అనవసరమైన లేయర్లను తగ్గించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

మొత్తం 30,000 ఉద్యోగాల కోత పూర్తయితే, ఇది అమెజాన్ మూడు దశాబ్దాల చరిత్రలోనే అతిపెద్ద తొలగింపు అవుతుంది. 2022లో కంపెనీ సుమారు 27,000 మందిని తొలగించింది. ఈ 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగుల్లో దాదాపు 10శాతం అయినప్పటికీ, సంస్థ మొత్తం 15.8 లక్షల మంది ఉద్యోగులతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
Amazon
Amazon layoffs
Andy Jassy
Amazon Web Services
AWS
Prime Video
Corporate layoffs
Job cuts
Artificial Intelligence

More Telugu News