Viral Video: విశాఖ తీరంలో అద్భుతం.. స్కూబా డైవర్లకు కనువిందు చేసిన భారీ తిమింగలం

Visakhapatnam Whale Shark Sighting Delight Scuba Divers
  • విశాఖ రుషికొండ తీరంలో స్కూబా డైవర్లకు కనిపించిన వేల్ షార్క్
  • సముద్రంలో 45 అడుగుల లోతులో వీడియో తీసిన డైవర్లు
  • ఇది అంతరించిపోతున్న జాతి అని నిపుణుల వెల్లడి
విశాఖపట్నం సముద్ర తీరంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. రుషికొండ సమీపంలో స్కూబా డైవింగ్ చేస్తున్న బృందానికి భారీ తిమింగలం (వేల్ షార్క్) కనువిందు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద చేప జాతిగా భావించే ఈ తిమింగలం, డైవర్లకు అతి సమీపంలోకి రావడంతో వారు ఆ క్షణాలను కెమెరాలో బంధించారు.

రుషికొండ తీరానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో, 45 అడుగుల లోతులో నలుగురు స్కూబా డైవర్లు అన్వేషణ సాగిస్తుండగా ఈ భారీ భారీ తిమింగలం ద‌ర్శ‌న‌మిచ్చింది. దాదాపు 12 నుంచి 20 మీటర్ల పొడవున్న ఈ భారీ జీవి తమ పక్కనే ఈదుతుండటంతో వారు ఆశ్చర్యపోయారు. చాలా కాలం తర్వాత రుషికొండ తీరంలో ఇలాంటి అరుదైన జీవి కనిపించడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు.

"స్కూబా డైవర్లు ఇంత దగ్గరగా తిమింగలం సొరను చూడటం విశాఖ తీరంలో ఇదే మొదటిసారి. మేము దానిని సుమారు ఐదు నిమిషాల పాటు చూడగలిగాం. అది మనుషులను చూసి ఎలాంటి ఆందోళన చెందలేదు. ఆ తర్వాత నెమ్మదిగా సముద్రంలోకి వెళ్లిపోయింది" అని డైవ్ అడ్డా స్కూబా డైవింగ్ శిక్షకుడు వైశాఖ్ శివరాజన్ తెలిపారు. 

అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం (IUCN) ఈ వేల్ షార్క్‌ను అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేర్చింది. గతంలో విశాఖ తీరానికి తిమింగలాలు కొట్టుకువచ్చిన సందర్భాలు ఉన్నప్పటికీ, సముద్రంలో ఇలా సజీవంగా కనిపించడం చాలా అరుదు. గత నెలలో యారాడ బీచ్‌లో ఓ భారీ తిమింగలం ఒడ్డుకు కొట్టుకురాగా, మత్స్యకారులు కాపాడేందుకు ప్రయత్నించినా అది ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.
Viral Video
Visakhapatnam
Whale Shark
Visakha coast
Rushikonda
Scuba diving
IUCN
Yarada Beach
Marine life
Andhra Pradesh

More Telugu News