Chiranjeevi: టాలీవుడ్ గాయనిగా మేనకోడలు ఎంట్రీ... మురిసిపోయిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi Celebrates Niece Nairas Tollywood Singing Debut
  • చిరంజీవి మేనకోడలు నైరా గాయనిగా అరంగేట్రం
  • 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంలో 'ఫ్లైయింగ్ హై' పాట
  • మేనకోడలి పాట విని మురిసిపోయిన మెగాస్టార్ చిరంజీవి
  • నైరాకు అభినందనలు తెలిపిన చిత్ర యూనిట్, కుటుంబ సభ్యులు
  • సింగపూర్‌లో పాప్ మ్యూజిక్ విద్యనభ్యసిస్తున్న నైరా
మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త ప్రతిభ వెండితెరకు పరిచయమైంది. మెగాస్టార్ చిరంజీవి సోదరి డాక్టర్ మాధవి రావు కుమార్తె నైరా, గాయనిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంలో 'ఫ్లైయింగ్ హై' అనే పాటను నైరా ఆలపించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో పాటు, పూర్తి వీడియో సాంగ్‌ను కూడా విడుదల చేసింది.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన మేనకోడలిని అభినందిస్తూ సోషల్ మీడియాలో భావోద్వేగంగా స్పందించారు. " 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలోని 'ఫ్లైయింగ్ హై' పాటను నా చిన్న మేనకోడలు నైరా పాడటం చూసి నా మనసు వర్ణించలేని ఆనందంతో నిండిపోయింది. ఇది నీకు ఆరంభం మాత్రమే. నీ ప్రయాణం ఎప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా, అంతులేని అవకాశాలతో నిండి ఉండాలి. ఎప్పుడూ ఇలాగే ప్రకాశిస్తూ, ఎత్తుకు ఎదగాలి" అని చిరంజీవి ఆశీర్వదించారు.

ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి, నిర్మాతగా వ్యవహరించిన చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల కూడా నైరాను అభినందనలతో ముంచెత్తారు. నైరా గాత్రంలో మంచి స్పష్టత ఉందని, ఆమెకు గొప్ప భవిష్యత్తు ఉందని ప్రశంసించారు. ప్రస్తుతం నైరా సింగపూర్‌లోని లసలా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో పాప్ మ్యూజిక్ విద్యనభ్యసిస్తున్నారు. తన మామయ్య సినిమాతో గాయనిగా పరిచయం కావడం పట్ల నైరా ఆనందం వ్యక్తం చేశారు.


Chiranjeevi
Naira
Manashankara Varaprasad Garu
Telugu movie song
Flying High song
Anil Ravipudi
Susmita Konidela
Telugu cinema
Lasalle College of the Arts

More Telugu News