Super Rich: మాపై అధిక పన్ను విధించండి: ప్రపంచ కుబేరుల ఆసక్తికర ప్రతిపాదన

Super Rich Demand Higher Taxes on Themselves
  • టైమ్ టు విన్ పేరిట సంతకాలు చేసి బహిరంగ లేఖ విడుదల
  • సంపన్నులకు, సామాన్యులకు మధ్య అంతరం పెరుగుతోందని ఆందోళన
  • ప్రపంచంలో అసలు సిసలైన ప్రజాస్వామ్య వ్యవస్థలను కోరుకుంటున్నామని వెల్లడి
ప్రపంచంలోని 400 సూపర్ రిచ్ (అత్యంత సంపన్నులు) వ్యాపారవేత్తలు ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన చేశారు. తమపై అధిక పన్నులు విధించాలని వారు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరవుతారు. ఈ నేపథ్యంలో, అక్కడకి వచ్చిన 400 మంది సంపన్నులు తమపై భారీగా పన్ను విధించాలంటూ పిలుపునివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

24 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సూపర్ రిచ్ బృందం 'టైమ్ టు విన్' పేరిట సంతకాలు చేసిన బహిరంగ లేఖను విడుదల చేసింది. మార్కు రుఫలో, బ్రియాన్ ఎనో, అబిగైల్ డిస్నీ వంటి సూపర్ రిచ్ ఈ మేరకు డిమాండ్ చేస్తూ బహిరంగ లేఖ రాశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానత్వాలు పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సంపన్నులకు, సామాన్యులకు మధ్య అంతరం నానాటికి పెరుగుతోందని తెలిపారు.

ఆర్థిక అసమానంతలను రూపుమాపడానికి సూపర్ రిచ్‌పై అధిక పన్ను విధించాలని వారు పేర్కొన్నారు. సంపన్నులు ప్రజా జీవితాన్ని, రాజకీయ వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరచడమే కాకుండా, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని అన్నారు. అత్యంత సంపన్నులు కొందరు ప్రజాస్వామ్యాలను కొనుగోలు చేశారని, ప్రభుత్వాలను స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.

ప్రపంచంలో అసలైన ప్రజాస్వామ్య వ్యవస్థలను తాము కోరుకుంటున్నామని వారు పేర్కొన్నారు. అధిక పన్నులు విధించడం వల్ల సంపన్నుల జీవన ప్రమాణాలు పడిపోవని గుర్తుంచుకోవాలని అన్నారు. పైగా ఆ నిధులు సామాన్యుల ఆరోగ్యం, విద్య వంటి వాటికి వినియోగించడానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.

వారు విడుదల చేసిన లేఖ ప్రకారం, ప్రపంచంలోని 1 శాతం సంపన్నుల వద్ద 95 శాతం కంటే ఎక్కువ సంపద ఉంది. జీ20 దేశాలలో నిర్వహించిన ఒక సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సంపన్నులు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారని 77 శాతం మంది భావించగా, కొందరి వద్దే అత్యధిక సంపద ఉండటం ప్రజాస్వామ్యానికి ముప్పుగా 62 శాతం మంది భావిస్తున్నారని సర్వేలో తేలింది.
Super Rich
Davos
World Economic Forum
Taxation
Wealth Inequality
Mark Ruffalo
Abigail Disney

More Telugu News