Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేశ్ కు బెయిల్.. అయినా జైల్లోనే..!

Jogi Ramesh Bail in Fake Liquor Case But No Release
  • ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేశ్ కు బెయిల్
  • ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఇంకా లభించని ఊరట
  • ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్‌తో పాటు నకిలీ మద్యం తయారీ కేసులు పెద్ద దుమారం రేపుతున్న వేళ, ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నకిలీ మద్యం కేసులో అరెస్టై జైల్లో ఉన్న వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ కు స్వల్ప ఊరట లభించింది. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీకి సంబంధించిన కేసులో జోగి రమేశ్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాముపై నమోదైన కేసును విచారించిన ఎక్సైజ్ కోర్టు ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది.


ఈ కేసులో జోగి రమేశ్, జోగి రాము గత 79 రోజులుగా విజయవాడ జైల్లో రిమాండ్‌ లో ఉన్నారు. కోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో, ఈ కేసులో వారికి తాత్కాలిక ఉపశమనం లభించినట్లైంది. అయితే, జోగి రమేశ్ కు పూర్తి ఊరట దక్కలేదు. ఎందుకంటే, ములకలచెరువు ప్రాంతంలో జరిగిన మరో నకిలీ మద్యం తయారీ కేసులో కూడా ఆయన నిందితుడిగా ఉన్నారు.


ఆ కేసులో ఇప్పటివరకు బెయిల్ లభించకపోవడంతో, ఇబ్రహీంపట్నం కేసులో బెయిల్ వచ్చినా జోగి రమేశ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదు. ములకలచెరువు కేసులో కూడా బెయిల్ మంజూరైతేనే ఆయన జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంది.

Jogi Ramesh
Andhra Pradesh
Liquor Scam
Fake Liquor
Excise Court
Vijayawada Jail
Ibrahimpatnam
Mulakalacheruvu

More Telugu News