Telugu weddings: ముహూర్తాలొచ్చేశాయ్.. మోగనున్న పెళ్లి బాజాలు

Telugu States Witnessing Wedding Season Resurgence After Break
  • మూడు నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి
  • ఫిబ్రవరి 19 నుంచి మొదలు కానున్న శుభ ముహూర్తాలు
  • ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ సర్వీసులకు భారీ డిమాండ్
  • విపరీతంగా పెరిగిన వివాహ సంబంధిత ఖర్చులు
  • ఆందోళనలో వధూవరుల కుటుంబ సభ్యులు
దాదాపు మూడు నెలల విరామం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లిళ్ల సందడి మొదలైంది. శుక్ర మౌఢ్యమి కారణంగా నవంబర్ నుంచి నిలిచిపోయిన శుభకార్యాలకు ఫిబ్రవరి 17తో అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో వధూవరుల కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాయి. కల్యాణ మండపాలు మళ్లీ కళకళలాడనున్నాయి.

పంచాంగం ప్రకారం ఫిబ్రవరి 19, 20, 21, 24, 25, 26 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 21న అత్యధిక వివాహాలు జరగనున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత మార్చి, ఏప్రిల్, మే, జూన్, జులై నెలల్లో కూడా శుభ ఘడియలు ఉండటంతో పురోహితులు, వెడ్డింగ్ ప్లానర్లు, క్యాటరర్ల డైరీలు పూర్తిగా నిండిపోయాయి.

అయితే, ఈ పెరిగిన డిమాండ్ వివాహ ఖర్చులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫంక్షన్ హాళ్లు, పురోహితులు, క్యాటరింగ్ సర్వీసుల రేట్లు ఆకాశాన్నంటడంతో వధూవరుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతంలో రూ.25-60 వేల మధ్య ఉండే పురోహితుల సంభావన ఇప్పుడు రూ.40-80 వేలకు చేరిందని పలువురు వాపోతున్నారు. అదేవిధంగా, రూ.10 లక్షల అద్దె పలికే ఫంక్షన్ హాళ్లకు ఇప్పుడు రూ.13 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే, పెళ్లిళ్లలో కీలకమైన బంగారం ధరలు కూడా పెరగడం కుటుంబాలపై మరింత భారం మోపుతోంది. దీంతో శుభ ఘడియలు వచ్చినా, పెరిగిన ఖర్చులను చూసి చాలా కుటుంబాలు సతమతమవుతున్నాయి.
Telugu weddings
wedding dates
marriage muhurthams
wedding costs
function halls
gold prices
February weddings
wedding season
Telugu states

More Telugu News