Pawan Kalyan: ఉగాదిలోపు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి: పవన్ కల్యాణ్

Pawan Kalyan Orders Action Plan for Green Cover Project by Ugadi
  • ఉగాది నుంచి 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టు అమలుకు పవన్ ఆదేశం
  • 2047 నాటికి రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంపే లక్ష్యం
  • ప్రాజెక్టులో అన్ని ప్రభుత్వ శాఖలు భాగస్వాములు కావాలని స్పష్టం
  • కాలుష్యాన్ని నియంత్రించే, స్వజాతి మొక్కలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్దేశం
రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంపే లక్ష్యంగా చేపట్టిన ‘గ్రీన్ కవర్’ ప్రాజెక్టును ఉగాది నుంచి అమలు చేయాలని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను (యాక్షన్ ప్లాన్) పండుగలోపు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ బృహత్ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖలూ త్రికరణ శుద్ధిగా పాలుపంచుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

మంగళవారం సచివాలయంలో ‘50% గ్రీన్ కవర్’ ప్రాజెక్టుపై అటవీ, పర్యావరణ శాఖలతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 2047 నాటికి రాష్ట్ర భూభాగంలో 50 శాతం పచ్చదనం నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30 శాతం పచ్చదనం ఉండగా, వచ్చే నాలుగేళ్లలో దీనిని 37 శాతానికి పెంచాల్సి ఉందని, ఇందుకోసం 9 లక్షల హెక్టార్లలో మొక్కలు నాటాలని వివరించారు.

ఈ యజ్ఞంలో అన్ని శాఖలు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పవన్ సూచించారు. పరిశ్రమల శాఖ కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటాలని, తీర ప్రాంతాల్లో ఉప్పునీటిని, పెనుగాలులను తట్టుకునే స్థానిక జాతుల మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించారు. ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ప్రాజెక్టును కూడా సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. రైతుల భూముల్లో వారికి దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే పండ్ల మొక్కలు, కాలువ గట్ల వెంబడి మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించాలని కోరారు.

సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, బడ్జెట్ కేటాయింపులపై ఆయనతో చర్చిస్తానని పవన్ అన్నారు. ఫిబ్రవరి 5న జరిగే తదుపరి సమావేశానికి పూర్తిస్థాయి ప్రణాళికలతో రావాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పలువురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, శాఖాధిపతులు పాల్గొన్నారు.
Pawan Kalyan
Green Cover Project
Andhra Pradesh
AP forest
Chandrababu Naidu
50 percent green cover
environmental project
tree plantation
ecological balance
sustainable development

More Telugu News