Chandrababu Naidu: "ఈయన దావోస్ మేన్"... జ్యూరిచ్ లో చంద్రబాబు గురించి కిశోర్ లుల్లా కామెంట్

Chandrababu Naidu Davos Man Kishore Lulla Comments in Zurich
  • జ్యూరిచ్‌లో ఈరోస్ ఇన్నోవేషన్స్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ
  • ఏపీని ఏఐ క్రియేటివ్ కంపెనీలకు హబ్‌గా మార్చడమే లక్ష్యం
  • ఏఐ ఫిల్మ్ సిటీ, వర్చువల్ టూరిజం వంటి ప్రాజెక్టులపై చర్చ
  • యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రధాన దృష్టి
ఆంధ్రప్రదేశ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత క్రియేటివ్ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దావోస్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిన ఆయన, ప్రముఖ సంస్థ ఈరోస్ ఇన్నోవేషన్స్ ప్రతినిధులతో జ్యూరిచ్‌లో సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఏఐ, డిజిటల్ కంటెంట్ రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయి.

ఈరోస్ ఇన్నోవేషన్స్ ప్రతినిధులు కిశోర్ లుల్లా, రిధిమా లుల్లా, స్వనీత్ సింగ్‌లతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి "ఈయన దావోస్ మేన్" అంటూ కిశోర్ లుల్లా పేర్కొనడం హైలైట్ గా నిలిచింది. రాష్ట్రంలో జనరేటివ్ ఏఐ ఆధారిత కార్యక్రమాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేకమైన జెన్‌ఏఐ మోడల్, కంటెంట్ సూపర్ యాప్, విద్యా రంగంలో ఏఐ భాగస్వామ్యం, ఏఐ ఆధారిత ఫిల్మ్ సిటీ, వరల్డ్ క్లాస్ వర్చువల్ ప్రొడక్షన్ స్టూడియోలు వంటి పలు కీలక ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిసింది.

వీటితో పాటు ఏఐ క్రియేటివ్ టెక్ హబ్, 'డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ 360' పేరుతో వర్చువల్ రియాలిటీ టూరిజం ప్రాజెక్టును కూడా చేపట్టాలని ప్రతిపాదించారు. ఈ కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ, డిజిటల్ కంటెంట్ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ ప్రయత్నాలన్నీ రాష్ట్ర యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడంలో సహాయపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు (WEF-26) నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Chandrababu Naidu
Andhra Pradesh
Artificial Intelligence
AI
Davos
World Economic Forum
Kishore Lulla
Eros Innovations
Digital Content
AP Tourism

More Telugu News