Renu Desai: రాజకీయాల్లోకి ఎంట్రీ, వీధి కుక్కల అంశాలపై రేణు దేశాయ్ ఏమన్నారంటే?

Renu Desai Clarifies Stance on Political Entry
  • హైదరాబాద్‌లో రేణు దేశాయ్ ప్రెస్ మీట్
  • రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని వెల్లడి
  • వీధి కుక్కలను చంపేయడంపై తీవ్ర ఆగ్రహం
  • ఒక కుక్క కరిస్తే వందల కుక్కలను చంపుతున్నారని మండిపాటు
  • ఒక్క మగాడు అత్యాచారానికి పాల్పడితే అందరూ రేపిస్టులు అవుతారా అని నిలదీత
తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో ప్రముఖ యాంకర్ రష్మితో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయాల్లోకి వస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆమె పై విధంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె వీధి కుక్కలను చంపడంపై తీవ్రంగా స్పందించారు.

ఒక కుక్క కరిస్తే వందల కుక్కలను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారని, మరి ఒక్క మగాడు అత్యాచారానికి పాల్పడితే అందరు మగాళ్లు రేపిస్టులు, హంతకులు అవుతారా? అని ఆమె ప్రశ్నించారు. కుక్క కాటు కారణంగా మనిషి చనిపోతే స్పందించే వ్యవస్థలు రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

సమాజంలో చిన్నారులపై అత్యాచారాలు జరిగినప్పుడు ఎవరూ స్పందించడం లేదని మండిపడ్డారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ వందల కుక్కలను చంపడమేమిటని ప్రశ్నించారు. కుక్క, ఆవు, గేదె, పిల్లి, కోతి ఇవన్నీ ప్రాణులు కాదా అని నిలదీశారు. వీధి కుక్కల సంఖ్య పెరగడానికి కారణం మన చుట్టూ ఉన్న అపరిశుభ్ర పరిస్థితులేనని వెల్లడించారు.

కుక్కలు పెరగడానికి గల అపరిశుభ్ర పరిస్థితులపై ఎవరూ ఆలోచన చేయడం లేదని అన్నారు. నిద్ర లేచిన దగ్గరి నుంచి కాలభైరవుడిని పూజిస్తారని, మరోవైపు కుక్కలను చంపుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరు అత్యాచారానికి పాల్పడితే మగవాళ్లందరినీ జైల్లో పెట్టడం లేదు కదా అన్నారు. తాను ఇంత గట్టిగా మాట్లాడినందుకు తనను జైల్లో పెట్టుకుంటే పెట్టుకోవచ్చని అన్నారు. వాహనాలు ఢీకొట్టడం వల్ల రోజుకు వందల సంఖ్యలో కుక్కలు గాయపడుతున్నాయని, అవి ఎవరి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నాయని ప్రశ్నించారు.

ఈ ప్రెస్ మీట్ వల్ల తనపై నెగిటివిటీ పెరుగుతుందని తనకు తెలుసని, అయినా తాను భయపడనని అన్నారు. తాను చెప్పడం వల్ల ఒక్కరైనా మారతారేమో అని ఆశిస్తున్నానని అన్నారు. ప్రభుత్వం వీధి కుక్కలకు ప్రత్యేక షెల్టర్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విదేశీ బ్రీడ్స్ పెంచుకునే యజమానులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.
Renu Desai
Renu Desai politics
Renu Desai interview
Rashmi Gautam
street dogs India
animal cruelty India

More Telugu News