Renuka Chowdary: మహిళల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు... స్పందించిన రేణుకా చౌదరి

Renuka Chowdary responds to news about womens clothing and female officer
  • మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరని ప్రశ్నించిన రేణుకా చౌదరి
  • మహిళల విషయంలో తప్పుడు వార్తలు రాయడం సరికాదన్న కాంగ్రెస్ నాయకురాలు
  • ఖమ్మంలో ఈసారి పోటీ చేస్తానన్న రేణుకా చౌదరి
మహిళల దుస్తులపై జరుగుతున్న వివాదంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి స్పందించారు. కొద్ది రోజుల క్రితం నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తులపై వ్యాఖ్యలు చేయడం, వాటిపై సినీ నటి అనసూయ వంటి వారు స్పందించడంతో మహిళల దుస్తుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ఎక్కువ మంది శివాజీకి మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళల దుస్తులపై రేణుకా చౌదరి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పడానికి మీరెవరని ఆమె ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల వేదికగా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మహిళలను అణగదొక్కాలని ఎవరు ప్రయత్నించినా వారికి తగిన గుణపాఠం చెబుతామని ఆమె అన్నారు. ఇటీవల ఒక మహిళా అధికారిపై మీడియాలో వచ్చిన వార్తలపై కూడా ఆమె తీవ్రంగా స్పందించారు. మహిళల విషయంలో తప్పుడు వార్తలు రాయడం ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు.

ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై ఆమె స్పందిస్తూ, ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పేదల హక్కులను కాలరాసే అధికారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేదని అన్నారు. ఖమ్మంలో ఈసారి పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. తన గెలుపును ఆపే దమ్ము కేటీఆర్‌కు ఉందా అని సవాల్ విసిరారు.
Renuka Chowdary
Renuka Chowdhury
women clothing
Anasuya
Shivaji
KTR
Khammam
Narendra Modi

More Telugu News