ICC: భారత్‌లో టీ20 ప్రపంచకప్‌.. పాక్ సంతతి ఆటగాళ్ల వీసాలపై రంగంలోకి దిగిన ఐసీసీ

ICC Steps In for T20 World Cup Visas of Pakistan Origin Players
  • భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ఐసీసీ ముందస్తు ఏర్పాట్లు
  • వివిధ దేశాల తరఫున ఆడుతున్న పాక్ సంతతి ఆటగాళ్ల వీసాలపై దృష్టి
  • ఇంగ్లండ్, నెదర్లాండ్స్‌ ఆటగాళ్లకు ఇప్పటికే వీసాలు మంజూరు
  • మిగతా వారికి వచ్చే వారం అపాయింట్‌మెంట్లు ఖరారు
  • జనవరి 31 లోగా ప్రక్రియ పూర్తి చేసేందుకు ఐసీసీ చర్యలు
భారత్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి ఐసీసీ కీలక చర్యలు చేపట్టింది. టోర్నీలో పాల్గొనే వివిధ దేశాల జట్లలో ఉన్న పాకిస్థాన్ సంతతికి చెందిన 42 మంది ఆటగాళ్లు, అధికారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీసాలు అందేలా చూస్తోంది. చివరి నిమిషంలో తలెత్తే సమస్యలను నివారించేందుకే ఐసీసీ ఈ బాధ్యతను తీసుకుంది.

ఇంగ్లండ్ జట్టులోని పాక్ సంతతికి చెందిన స్పిన్నర్లు ఆదిల్ రషీద్, రెహాన్ అహ్మద్, పేసర్ సాకిబ్ మహమూద్‌లకు ఇప్పటికే వీసాలు మంజూరైనట్లు మీడియా వర్గాలు తెలిపాయి. వీరితో పాటు కెనడా సహాయక సిబ్బందిలోని షా సలీం జాఫర్‌కు కూడా క్లియరెన్స్ లభించింది.

అమెరికా జట్టులో అలీ ఖాన్, షాయన్ జహంగీర్, నెదర్లాండ్స్‌లో జుల్ఫికర్ సాకిబ్ వంటి పాక్ మూలాలున్న ఆటగాళ్లు ఉన్నారు.

ప్రస్తుతం యూఏఈ, అమెరికా, ఇటలీ, బంగ్లాదేశ్, కెనడా జట్లలోని పాక్ జాతీయత లేదా సంతతికి చెందిన మిగతా ఆటగాళ్లు, అధికారుల వీసాల ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే వారం ఆరంభంలోనే వీరికి వీసా అపాయింట్‌మెంట్లు ఖరారు కావడంతో, ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. వీసాల జారీకి ఈ నెల‌ 31ని గడువుగా నిర్ణయించారు.

సాధారణంగా పాకిస్థాన్ సంతతికి చెందిన వారు భారత వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే ఎక్కువ పరిశీలన ఉంటుంది, ప్రక్రియ ఆలస్యమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఐసీసీ ముందుగానే రంగంలోకి దిగింది. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లోని భారత హైకమిషన్లతో ఐసీసీ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఫిబ్రవరి 7న టోర్నమెంట్ ప్రారంభమయ్యే నాటికి లాజిస్టిక్స్ పరంగా అన్ని జట్లు సన్నద్ధంగా ఉండేలా చూడటమే లక్ష్యంగా ఐసీసీ శ్రమిస్తోంది.
ICC
T20 World Cup
India
Pakistan
Visa
Adil Rashid
Rehan Ahmed
Cricket
Players
Clearance

More Telugu News