Bandla Ganesh: తిరుమల కొండకు బండ్ల గణేశ్ పాదయాత్ర

Bandla Ganesh to Undertake Padayatra to Tirumala
  • రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభం
  • వైసీపీ పాలనలో చంద్రబాబు అరెస్టైనపుడు మొక్కుకున్నట్లు వెల్లడి
  • నా మనోవేదన తీర్చిన శ్రీనివాసుడికి మొక్కుబడి యాత్ర అని వ్యాఖ్య
ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తిరుమలకు పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. వైసీపీ హయాంలో చంద్రబాబు అరెస్టైన సందర్భంలో శ్రీనివాసుడికి మొక్కుకున్నానని, తాజాగా ఈ మొక్కు చెల్లించుకోవడానికి సంకల్ప యాత్ర చేపడుతున్నానని వివరించారు. ‘నా గడప నుంచి నీ కొండ దాకా పాదయాత్ర’ చేస్తానని తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని ఆయన గుర్తుచేసుకున్నారు. రేపు (సోమవారం) ఉదయం 9 గంటలకు షాద్ నగర్ లోని తన నివాసం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా బండ్ల గణేశ్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

‘దేశం గర్వించే దార్శనికుడు చంద్రబాబుపై అభాండాలు తొలగిపోవాలని.. జైలు నుంచి ఆయన బయటకు రావాలని సుప్రీంకోర్టు గడపపై నిలుచుని శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థించా. తిరుమలకు పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నా. చంద్రబాబు మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించుకున్నారు. ఇటీవలే ఆయనపై కేసులన్నీ కొట్టేశారు. దీంతో నా మనసు కుదుటపడింది. నా కుటుంబం మొక్కు గుర్తుతెచ్చుకుంది. ఇంకా నా గడప నన్ను అడుగుతోంది మొక్కు తీర్చుకోమని. శేషాచలం కొండ పిలుస్తోంది వచ్చి దర్శించుకోమని. అందుకే అమ్మానాన్నల ఆశీర్వాదాలతో షాద్‌నగర్‌లోని మా ఇంటి గడప ముందు కొబ్బరికాయ కొట్టి పాదయాత్ర ప్రారంభిస్తాను. ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో కొండకు చేరి దర్శనం చేసుకుంటాను. ఇది రాజకీయ యాత్ర కాదు. నా మనోవేదన తీర్చిన ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామికి నా మొక్కుబడి చెల్లింపు’ అని బండ్ల గణేశ్‌ తెలిపారు.
Bandla Ganesh
Tirumala
Padayatra
Chandrababu Naidu
Venkateswara Swamy
YCP
మొక్కుబడి
Shahd Nagar
Andhra Pradesh Politics
Supreme Court

More Telugu News