Balakrishna: సినీ, రాజకీయాల్లో ఎన్టీఆర్‌ది చెరగని ముద్ర.. పేదల ఆకలి తెలిసిన నాయకుడు: బాలకృష్ణ

NTR A Lasting Impression in Cinema and Politics Says Balakrishna
  • ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన నందమూరి కుటుంబం
  • సినీ, రాజకీయాల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారన్న బాలకృష్ణ
  • బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచారని గుర్తుచేసుకున్న బాలయ్య
  • ఎన్టీఆర్ స్ఫూర్తితోనే టీడీపీ ముందుకు సాగుతోందని వెల్లడి
దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ సీఎం చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులు పుష్పాంజలి ఘటించారు. 

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ తనదైన చెరగని ముద్ర వేశారని అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ, ఎన్టీఆర్ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. "మహానుభావులు కావాలంటే ఎంతో శ్రమ, దీక్ష అవసరం. ఆ లక్షణాలు ఎన్టీఆర్‌లో పుష్కలంగా ఉన్నాయి. సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన బతికే ఉంటారు. సినిమాల్లో ఎవరూ చేయలేని పాత్రలు చేసి, నటనలో పరకాయ ప్రవేశంతో ఎన్నో ప్రయోగాలు చేశారు" అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాల్లో సంచలనం సృష్టించారని, రాజకీయాలను కొందరికే పరిమితం కాకుండా అందరికీ చేరువ చేశారని తెలిపారు.

పేదల ఆకలి బాధ తెలిసిన నాయకుడు కాబట్టే బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలిచారని బాలకృష్ణ అన్నారు. అప్పట్లో ఆయన తీసుకొచ్చిన పథకాలే ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని చెప్పారు. తెలుగు గంగ, గాలేరు నగరి వంటి ప్రాజెక్టులతో ప్రజలకు మేలు చేశారని, ఆయన స్ఫూర్తితోనే టీడీపీ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. తెలుగువారి గుండెచప్పుడు, కళామతల్లి ముద్దుబిడ్డ ఎన్టీఆర్ అని, తెలుగుజాతి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు.
Balakrishna
NTR
Nandamuri Taraka Rama Rao
Nara Bhuvaneswari
TDP
Telugu Desam Party
NTR Ghat
Andhra Pradesh Politics
Telugu Cinema
Political Legacy

More Telugu News