Chandrababu Naidu: 'ఏపీ ఫస్ట్'... తిరుపతిలో అతి పెద్ద రీసెర్చ్ సెంటర్: సీఎం చంద్రబాబు ప్రకటన

Chandrababu Naidu Announces AP FIRST Research Center in Tirupati
  • తిరుపతిలో 'ఏపీ ఫస్ట్' పేరుతో భారీ పరిశోధన కేంద్రం
  • ఐఐటీ-ఐఐఎస్‌ఈఆర్ భాగస్వామ్యంతో ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్
  • భవిష్యత్ టెక్నాలజీ రంగాల్లో యువతకు నైపుణ్యం అందించడమే లక్ష్యం
  • రాష్ట్రంలో డ్రోన్ కార్పొరేషన్‌ను మరింత బలోపేతం చేయాలని ఆదేశం
  • వ్యవసాయం, వైద్యంలో డ్రోన్ల వినియోగం పెంచాలని సూచన
ఆంధ్రప్రదేశ్‌లో యువత భవిష్యత్తును తీర్చిదిద్దడంతో పాటు, శాస్త్ర సాంకేతిక రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు ఊతమిచ్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. తిరుపతి కేంద్రంగా 'ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ' (AP FIRST) పేరుతో రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతిలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) భాగస్వామ్యంతో ఈ కేంద్రాన్ని నెలకొల్పనున్నారు.

శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఏరో స్పేస్-డిఫెన్స్, ఐటీ-డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ సలహాదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో డ్రోన్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఫస్ట్ ఏర్పాటు ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు. రాష్ట్రంలోని యువతకు, పరిశ్రమలకు మధ్య వారధిగా నిలుస్తూ, భవిష్యత్ అవసరాలకు తగ్గ నైపుణ్యాలను అందించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, "రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. భవిష్యత్తులో ఏరో స్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ, హెల్త్ కేర్, బయో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ వంటివి అత్యంత కీలక రంగాలుగా మారనున్నాయి. వీటికి అనుగుణంగా మన యువతను సిద్ధం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది" అని అన్నారు. దేశంలోనే తొలిసారిగా కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కొత్త ఆవిష్కరణలకు, స్టార్టప్‌లకు ఏపీ ఒక వేదికగా నిలవాలని, అందుకు అవసరమైన నైపుణ్యమున్న మానవ వనరులను ఏపీ ఫస్ట్ అందించాలని ఆకాంక్షించారు.

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ప్రముఖ కంపెనీలు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో ఏపీ ఫస్ట్ అనుసంధానమై పనిచేయాలని సీఎం సూచించారు. "గతంలో ఐటీ, ఫార్మా రంగాలను ప్రోత్సహించడం వల్లే తెలుగువారు ఆ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారు. అదే తరహాలో భవిష్యత్ రంగాలను నేటి యువత అందిపుచ్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. వచ్చే మూడేళ్లలో ఏపీ ఫస్ట్ కీలక పురోగతి సాధించాలి" అని దిశానిర్దేశం చేశారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యా సంస్థల కరిక్యులమ్‌ను తీర్చిదిద్దడంలోనూ ఈ కేంద్రం సహాయపడాలని స్పష్టం చేశారు.

డ్రోన్ టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి

ఇదే సమావేశంలో డ్రోన్ కార్పొరేషన్‌ను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలోనే కాకుండా వ్యవసాయం, మెడికల్ ఎమర్జెన్సీ వంటి రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని గణనీయంగా పెంచాలన్నారు. 

"డ్రోన్ ట్యాక్సీ, డ్రోన్ అంబులెన్స్ వంటి అంశాలపై లోతైన అధ్యయనం చేయాలి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తరహాలో 'డ్రోన్ ట్రాఫిక్ కంట్రోల్ మేనేజ్‌మెంట్' వ్యవస్థ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను కేంద్రంతో సంప్రదించి పరిశీలించండి," అని అధికారులకు సూచించారు. టెక్నాలజీని ముందుగానే అందిపుచ్చుకోవడం ద్వారా వ్యవస్థలను సిద్ధం చేయాలన్నారు. వచ్చే అంతర్జాతీయ డ్రోన్ దినోత్సవం నాటికి డ్రోన్ల ద్వారా అందించే సేవలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపాలని ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఏరో స్పేస్ డిఫెన్స్ సలహదారు సతీష్ రెడ్డి, ఐటీ-డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ సలహదారు అమిత్ దుగర్, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కె.ఎన్. సత్యనారాయణ, ప్రొఫెసర్ సెంథిల్ కుమార్, డీఎంటీఐ డైరెక్టర్ కల్నల్ పి.ఎస్. రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Chandrababu Naidu
AP FIRST
Andhra Pradesh
Tirupati
Research Center
IIT Tirupati
IISER Tirupati
Drone Technology
Innovation
Technology

More Telugu News