Revanth Reddy: మోదీని అందుకే కలుస్తున్నా: రేవంత్ రెడ్డి
- రాష్ట్ర అభివృద్ధి కోసమే మోదీని కలుస్తున్నానన్న రేవంత్ రెడ్డి
- బాసరలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడి
- ప్రజలు అండగా ఉంటే రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తానన్న సీఎం
ఎన్నికల సమయంలో రాజకీయాలు సహజమేనని, కానీ ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం అందరం కలిసి ముందుకు సాగాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తామని, సాధ్యమైనంత వరకు అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. మోదీ తనకు వ్యక్తిగత బంధువుకాదని, దేశ ప్రధాని కాబట్టే ప్రాంత అభివృద్ధి కోసం ఆయనను కలుస్తున్నానని తెలిపారు. ప్రాంత ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తానని, తనకు వ్యక్తిగత పైరవీలు లేదా స్వార్థ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు. నిర్మల్ లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ఎంతో ప్రత్యేకమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ జిల్లాకు అందాల్సిన న్యాయం, జరగాల్సిన అభివృద్ధి గతంలో సరిగా జరగలేదని వ్యాఖ్యానించారు. పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాకు కూడా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇప్పటివరకు విశ్వవిద్యాలయం లేకపోవడం దురదృష్టకరమని పేర్కొంటూ, ఈ ప్రాంతానికి వర్సిటీ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలోనే విశ్వవిద్యాలయానికి అధికారిక ఆమోదం వస్తుందని, బాసరలో వర్సిటీ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉమ్మడి జిల్లాకు అవసరమైన అన్ని నిధులను బడ్జెట్‌లో పొందుపరుస్తామని హామీ ఇచ్చారు.
తుమ్మడి హెట్టి వద్ద ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నామని, అక్కడే ప్రాజెక్టును నిర్మించి తీరుతామని సీఎం స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఆదిలాబాద్‌కు విమానాశ్రయం తీసుకొచ్చే పూర్తి బాధ్యత తనదేనని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు శిలాఫలకం వేయిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్ మంజూరు చేసినట్లే ఆదిలాబాద్‌కూ ఇస్తామని కేంద్రం చెప్పిందని సీఎం గుర్తు చేశారు. అడిగితేనే అభివృద్ధి వస్తుందని, గత పాలకులు అడగకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. వారి పాలన వల్ల అప్పులు మిగిలాయని, నాడు ఇచ్చిన బియ్యం ఎవరు తిన్నారో తెలియదని, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం ప్రజలు తింటున్నారని అన్నారు. సున్నా వడ్డీ పేరుతో గుండు సున్నా మిగిల్చారని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రజలు అండగా నిలిస్తే దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతానని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయని, ప్రజా ప్రభుత్వంతో కలిసి పనిచేసే వారినే గెలిపించాలని కోరారు.