Vijayawada West Bypass: అందుబాటులోకి వచ్చిన విజయవాడ వెస్ట్ బైపాస్
- కాజా నుంచి పెదఅవుటపల్లి వరకు ఒకవైపు రహదారి అందుబాటులోకి
- మార్చి నాటికి అందుబాటులోకి రానున్న రెండో వైపు రహదారి
- అన్ని రకాల వాహనాలను అనుమతిస్తున్న అధికారులు
సంక్రాంతి కానుకగా విజయవాడ వెస్ట్ బైపాస్‌లో ఒకవైపు రహదారిని (మంగళగిరి మండలం కాజా నుంచి పెదఅవుటపల్లి వరకు) అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు శాస్త్రోక్తంగా పూజలు చేసి, మొదట అధికారుల వాహనాలను, ఆ తర్వాత ప్రజల వాహనాలను అనుమతించారు. ప్రస్తుతం అన్ని రకాల వాహనాలను రహదారిపై అనుమతిస్తున్నారు.
ఈ బైపాస్ నేషనల్ హైవే-16 (చెన్నై-కోల్‌కతా)ని నేషనల్ హైవే-65 (విజయవాడ-హైదరాబాద్)తో అనుసంధించే ముఖ్యమైన ప్రాజెక్ట్. దీని వల్ల విజయవాడ నగరంలోకి రాకుండానే గుంటూరు నుంచి వచ్చే వాహనాలు నేరుగా రాజధాని (అమరావతి) లేదా హైదరాబాద్, ఏలూరు వైపు వెళ్లవచ్చు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... మార్చి నాటికి రెండోవైపు రహదారిని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. పూర్తి స్థాయిలో రహదారి అందుబాటులోకి వచ్చిన తర్వాత వెంకటపాలెం దగ్గర టోల్ ఫీజు వసూలు చేస్తామని వెల్లడించారు.
ఈ రహదారి దాదాపు 48 కి.మీ. పొడవు ఉంది. ఆరు లేన్లతో నిర్మితమవుతోంది. ఈ రహదారితో విజయవాడ నగర ట్రాఫిక్ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం లభించనుంది.