Karimnagar Honeytrap: వలపు వల.. వీడియోలతో బ్లాక్‌మెయిల్: కరీంనగర్‌లో కిలాడీ దంపతుల అరెస్టు

Karimnagar Honeytrap Couple Arrested for Blackmail
  • వ్యాపార నష్టాల నుంచి గట్టెక్కేందుకు హనీట్రాప్ దందా
  • సోషల్ మీడియాలో ఎర వేసి 100 మందికి పైగా బాధితుల నుంచి వసూళ్లు
  • రూ.13 లక్షలు పోగొట్టుకున్న వ్యాపారి ఫిర్యాదుతో బయటపడ్డ బాగోతం
  • నిందితుల నుంచి కారు, ఫోన్లు, నగదు స్వాధీనం
వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి అడ్డదారి తొక్కిన ఓ దంపతుల బాగోతం బట్టబయలైంది. సోషల్ మీడియా వేదికగా అమాయక పురుషులకు వల వేసి, ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న భార్యాభర్తలను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ దంపతులు పదేళ్లుగా కరీంనగర్‌లోని ఆరెపల్లిలో నివాసం ఉంటున్నారు. భర్త మార్బుల్, ఇంటీరియర్ వ్యాపారం చేయగా, భార్య యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో పాటు, ఫ్లాట్ ఈఎంఐలు కట్టడం భారంగా మారింది. దీంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరిద్దరూ కలిసి 'హనీట్రాప్' పథకం రచించారు.

భార్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అర్ధనగ్న ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ పురుషులను ఆకర్షించేది. ఆమె వలలో పడిన వారిని తన అపార్ట్‌మెంట్‌కు పిలిపించుకునేది. బాధితులతో ఆమె సన్నిహితంగా ఉన్న సమయంలో భర్త రహస్యంగా వీడియోలు చిత్రీకరించేవాడు. ఆ తర్వాత ఆ వీడియోలను చూపించి బాధితులను బెదిరించేవారు. డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతామని, ప్రాణాలు తీస్తామని హెచ్చరించేవారు.

గడిచిన మూడేళ్లలో ఈ దంపతులు సుమారు 100 మందికి పైగా వ్యాపారులు, డాక్టర్లు, విద్యార్థులను వేధించి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఈ అక్రమ సంపాదనతో రూ.65 లక్షల విలువైన ప్లాట్, ఖరీదైన కారు, ఫర్నిచర్ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది.

కరీంనగర్‌కు చెందిన ఓ లారీ వ్యాపారి నుంచి ఈ దంపతులు ఇప్పటికే రూ.13 లక్షలు వసూలు చేశారు. అదనంగా మరో రూ.5 లక్షల కోసం వేధించడంతో తట్టుకోలేకపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి బృందం బుధవారం నిందితులను అదుపులోకి తీసుకుంది. వారి నుంచి నేరానికి వాడిన ఫోన్లు, కారు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Karimnagar Honeytrap
Honeytrap Couple Arrest
Blackmail Arrest
Extortion Case
Cyber Crime
Instagram Crime
Arepally
Karimnagar Crime
Telangana Crime
Social Media Blackmail

More Telugu News