Pattabhiram: తెలుగు రాష్ట్రాల మధ్య వైసీపీ, బీఆర్ఎస్ చిచ్చు పెడుతున్నాయి: పట్టాభిరామ్ ఫైర్

Pattabhiram Fires at YCP and BRS for Disrupting Telugu States Relations
  • వైసీపీ, బీఆర్ఎస్ కలిసి తెలుగు ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయన్న పట్టాభి
  • సాక్షి, నమస్తే తెలంగాణ పత్రికలు ఉమ్మడిగా తప్పుడు కథనాలు రాస్తున్నాయని ఆగ్రహం
  • జగన్ తన ఆస్తుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్‌కు తాకట్టు పెట్టారని విమర్శలు
  • రాయలసీమ లిఫ్ట్, పోలవరంపై జగన్, కేసీఆర్ నాటకాలు ఆడారని వ్యాఖ్యలు
  • చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకోవడం తమ ప్రభుత్వ విధానమని స్పష్టీకరణ
తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించి, రాజకీయ లబ్ధి పొందడమే లక్ష్యంగా వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉమ్మడి కుట్రకు పాల్పడుతున్నాయని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రెండు పార్టీలు తమ స్వార్థ రాజకీయాల కోసం తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు రెండు రాష్ట్రాలు బాగుండాలని ఆలోచిస్తే, వైసీపీ-బీఆర్ఎస్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.

ఈ కుట్రలో భాగంగానే వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల అధికారిక పత్రికలైన 'సాక్షి', 'నమస్తే తెలంగాణ' సమన్వయంతో పనిచేస్తూ ప్రజలను రెచ్చగొట్టేలా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని పట్టాభిరామ్ ఆరోపించారు. "తెలంగాణ నీటికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని 'నమస్తే తెలంగాణ' రాస్తుంది. అదే సమయంలో, రాయలసీమకు ద్రోహం చేసి తెలంగాణకు న్యాయం చేస్తున్నారని 'సాక్షి' కథనం ప్రచురిస్తుంది. రెండు పత్రికలు, రెండు పార్టీలు, రెండు కుటుంబాలు కలిసి తెలుగు ప్రజలను మోసం చేస్తున్నాయి" అని ఆయన దుయ్యబట్టారు.

గతంలో ఇరు పార్టీల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాన్ని పట్టాభిరామ్ గుర్తుచేశారు. "పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక మీటర్ తగ్గించుకుంటే ఏమవుతుందని కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడితే, అప్పటి సీఎం జగన్ ఖండించకపోగా ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు. జగన్ పుట్టినరోజున తాడేపల్లి ప్యాలెస్ ముందు కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో ఫ్లెక్సీలు కడతారు. ఇలాంటి బంధం రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా, కేవలం వారి రాజకీయ మనుగడ కోసమే" అని విమర్శించారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలోనూ ఈ రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని పట్టాభి ఆరోపించారు. "ఈ ప్రాజెక్టును తామే ఆపామని హరీశ్ రావు, సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నా... జగన్ వారిని ప్రశ్నించకుండా, కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం వెనుక మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. ‘నీ రాష్ట్రంలో నువ్వు డ్రామా ఆడు, నా రాష్ట్రంలో నేను ఆడుతా’ అన్నట్లుగా జగన్, కేసీఆర్ వ్యవహరించారు. ఈ ప్రాజెక్టుపై ఎన్జీటీ అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు జగన్ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? కేవలం డీపీఆర్ అంటూ రూ.1000 కోట్లు దోచుకున్నారు" అని ఆరోపించారు.

హైదరాబాద్‌లోని తన ఆస్తులు, ప్యాలెస్‌లను కాపాడుకోవడం కోసమే జగన్.. బీఆర్ఎస్ నేతలతో దోస్తీ చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆయన అన్నారు. కేవలం విందులు, చేపల పులుసు కోసమే తప్ప, రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ ఏనాడూ పనిచేయలేదని విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు వద్దని, చర్చల ద్వారా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నదే తమ కూటమి ప్రభుత్వ విధానమని పట్టాభి స్పష్టం చేశారు. వైసీపీ, బీఆర్ఎస్ కుట్రలను ప్రజలు గత ఎన్నికల్లోనే గ్రహించి బుద్ధి చెప్పినా వారి తీరు మారలేదని, ప్రజలు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Pattabhiram
Andhra Pradesh
YS Jagan
KCR
BRS
YCP
Telugu States
Politics
AP Politics
Telangana Politics

More Telugu News