Ramachander Rao: మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై స్పందించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు

Ramachander Rao Comments on Municipal Elections and Kavithas Party
  • తమ పార్టీకి ఎవరైనా మద్దతిస్తే స్వాగతిస్తాన్న రామచందర్ రావు
  • జనసేన రాజకీయ పార్టీ.. తెలంగాణలో పోటీ చేస్తే తప్పేముందని ప్రశ్న
  • గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని వ్యాఖ్య
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పష్టం చేశారు. తమ పార్టీకి ఎవరైనా మద్దతు తెలిపితే స్వాగతిస్తామని ఆయన పేర్కొన్నారు. జనసేన ఒక రాజకీయ పార్టీ అని, ఆ పార్టీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎలాంటి అభ్యంతరం ఉండదని ఆయన అన్నారు.

హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ ఎదుగుదలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయడానికి గులాబీ పార్టీకి అభ్యర్థులే కరవయ్యారని ఎద్దేవా చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మంచి ఫలితాలు సాధించిందని ఆయన గుర్తు చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటుతామని రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఎంపీలు వారి నివాసాల్లో సమావేశం కావడంలో తప్పులేదని ఆయన అన్నారు. తనకు వ్యతిరేకంగా ఎవరైనా సమావేశం అయ్యారనే విషయంపై తనకు సమాచారం లేదని ఆయన తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీ పెడతారో లేదో తనకు తెలియదని ఆయన స్పష్టం చేశారు.
Ramachander Rao
Telangana BJP
Municipal Elections
BJP Telangana
BRS Party
Kavitha
Telangana Jagruthi

More Telugu News