Jay Shah: టీ20 వరల్డ్ కప్ 2026: భారత్‌లో ఆడబోమన్న బంగ్లాదేశ్... రంగంలోకి జై షా

Jay Shah to Resolve T20 World Cup 2026 Issue with Bangladesh
  • టీ20 ప్రపంచకప్ 2026 వేదికలపై తీవ్ర వివాదం
  • భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరణ
  • వివాద పరిష్కారానికి ఐసీసీ చైర్మన్ జై షా ప్రయత్నం!
  • బీసీసీఐతో రేపు జరగనున్న కీలక సమావేశం
  • భారత్‌లో ఆడకుంటే పాయింట్లు కోల్పోతారని బంగ్లాకు ఐసీసీ హెచ్చరిక
2026 ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ముందే ఒక పెద్ద వివాదం రాజుకుంది. తమ జట్టు భద్రత దృష్ట్యా భారత్‌లో ఆడేందుకు తాము సిద్ధంగా లేమని, తమ మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఐసీసీని అధికారికంగా కోరింది. ఈ నేపథ్యంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ చైర్మన్ జై షా రంగంలోకి దిగారు. ఆదివారం ఆయన బీసీసీఐ అధికారులతో అత్యవసరంగా సమావేశం కానున్నారు.

ఈ వివాదానికి మూలం ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయంటూ భారత్‌లో నిరసనలు వెల్లువెత్తడంతో, బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి రిలీజ్ చేయాలని బీసీసీఐ ఆదేశించింది. ఈ నిర్ణయంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)... బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది. అంతేకాదు, తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ భారత్‌లో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడలేమని స్పష్టం చేసింది.

ఇది కేవలం భద్రతా సమస్య కాదని, తమ జాతీయ గౌరవానికి సంబంధించిన విషయమని బీసీబీ... ఐసీసీకి రాసిన లేఖలో పేర్కొంది. తమ ఆటగాళ్లు, సిబ్బంది అందరికీ మ్యాన్-టు-మ్యాన్ సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేసింది. అయితే, ఈ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది. ఒకవేళ భారత్‌లో ఆడేందుకు నిరాకరిస్తే పాయింట్లు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ కొన్ని గ్రూప్ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబైలో ఆడాల్సి ఉంది. 

ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఐసీసీ చైర్మన్‌గా జై షా పాత్ర కీలకంగా మారింది. ఆయన బీసీసీఐ ప్రతినిధిగా కాకుండా, తటస్థంగా వ్యవహరించి సమస్యను పరిష్కరించాల్సి ఉంది. రేపటి సమావేశం తర్వాత ఈ వివాదానికి శాంతియుత పరిష్కారం లభిస్తుందో లేదోనని క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Jay Shah
T20 World Cup 2026
Bangladesh Cricket Board
BCCI
ICC
Mustafizur Rahman
India
Sri Lanka
Security Concerns
IPL 2026

More Telugu News