Sajjala Ramakrishna Reddy: సజ్జల వల్లే జగన్ 151 నుంచి 11 సీట్లకు పడిపోయాడు: బీటీ నాయుడు

BT Naidu Slams Sajjala for YCP Loss in AP Elections
  • వైసీపీ నేతలు వణికిపోయే పరిస్థితికి సజ్జలే కారణమన్న బీటీ నాయుడు
  • వైసీపీ ప్రభుత్వాన్ని సజ్జల నాశనం చేశారని వారి పార్టీ నేతలే చెబుతున్నారని వ్యాఖ్య
  • ప్రభుత్వ సలహాదారుడిగా ప్రజల సొమ్ము కాజేశాడని ఆరోపణ

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సజ్జల ఇచ్చిన సలహాల వల్లే జగన్ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు గజగజ వణికిపోయే స్థితి రావడానికి సజ్జలే కారణమని చెప్పారు. సజ్జల కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదని, అలాంటి వ్యక్తి చట్టసభలు, ప్రభుత్వ విధానాలు, పాలసీలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 


సజ్జల స్వయంగా మాట్లాడుతున్నారా లేక తాడేపల్లి ప్యాలెస్‌లో బందీగా ఉన్న జగన్ మాట్లాడిస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ రోజు సజ్జల మాటలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని, సొంత పార్టీలోనే ఆయనను ఛీ కొడుతున్నారని, గత ప్రభుత్వాన్ని నాశనం చేసింది సజ్జలేనని వైసీపీ నాయకులు బహిరంగంగా చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.


గత వైసీపీ ప్రభుత్వ పాలనలో సజ్జల ప్రధాన సలహాదారుడిగా ప్రజల ధనాన్ని కాజేశారని ఆరోపించారు. దమ్ము, ధైర్యం ఉంటే పార్టీలో నీ హోదా ఏంటో చెప్పాలని సవాల్ విసిరారు. పార్టీ హోదా లేకుండా కూటమి ప్రభుత్వంపై అవాకులు చెవాకులు మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. 


అమరావతి గురించి సజ్జలకు అసలు ఏమీ తెలియదని, గత ప్రభుత్వంలో అమరావతిని 'భ్రమరావతి', 'శ్మశానం' అని పిలిచారని, ప్లాన్ ప్రకారమే రాష్ట్రాన్ని రాజధాని లేని స్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ రోజు పిల్లలను ఏపీ రాజధాని ఏది అని అడిగితే చెప్పలేని పరిస్థితి సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో జగన్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేశారని, వాస్తవాలు తెలుసుకున్న ప్రజలు ఎన్నికల్లో వైసీపీకి రెండు అంకెల సీట్లే ఇచ్చారని అన్నారు.


అయినా జగన్ తన మాజీ సలహాదారు సజ్జలతో అమరావతి గురించి ప్రెస్ మీట్ పెట్టించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. జగన్ రెడ్డి దొంగల ముఠా అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను సందర్శించాలని సూచించారు. వేల కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. "కళ్లు ఉండి చూడలేని కబోదులు మీరు" అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజలను మభ్యపెట్టడం కోసమే, కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే సజ్జల మీడియా ముందుకు వచ్చారని బీటీ నాయుడు విమర్శించారు.

Sajjala Ramakrishna Reddy
BT Naidu
YCP
TDP
Andhra Pradesh Politics
Amaravati
Jagan Mohan Reddy
AP Elections 2024
Political Advisor
Telugu Desam Party

More Telugu News