Ashleigh Gardner: డీవై పాటిల్ స్టేడియంలో పరుగుల ప్రవాహం... గుజరాత్ జెయింట్స్ దే గెలుపు

Ashleigh Gardner Leads Gujarat Giants to Victory in WPL 2026
  • డబ్ల్యూపీఎల్ 2026లో గుజరాత్ జెయింట్స్ శుభారంభం
  • యూపీ వారియర్జ్‌పై 10 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయం
  • గుజరాత్ బ్యాటర్ ఆష్లే గార్డ్‌నర్ అద్భుత హాఫ్ సెంచరీ
  • యూపీ బ్యాటర్ ఫోబ్ లీచ్‌ఫీల్డ్ మెరుపు ఇన్నింగ్స్ వృథా
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌లో గుజరాత్ జెయింట్స్ గెలుపుతో శుభారంభం చేసింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో యూపీ వారియర్జ్‌పై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు చెలరేగడంతో అసలైన టీ20 మజా లభించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ వారియర్జ్ బౌలింగ్ ఎంచుకోగా, గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ ఆష్లే గార్డ్‌నర్ (41 బంతుల్లో 65) అద్భుత హాఫ్ సెంచరీతో జట్టును ముందుండి నడిపించింది. ఆమెకు సోఫీ డివైన్ (20 బంతుల్లో 38), అనుష్క శర్మ (30 బంతుల్లో 44) చక్కటి సహకారం అందించారు. చివరిలో జార్జియా వేర్‌హామ్ (10 బంతుల్లో 27 నాటౌట్), భారతి ఫుల్మాలి (7 బంతుల్లో 14 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో గుజరాత్ భారీ స్కోరును నమోదు చేసింది.

అనంతరం 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ గట్టిగానే పోరాడింది. ఫోబ్ లీచ్‌ఫీల్డ్ (40 బంతుల్లో 78 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఆమె ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే, కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో యూపీ లక్ష్యానికి దూరమైంది. చివర్లో శ్వేతా సెహ్రావత్ (25), ఆశా శోభన (27 నాటౌట్) రాణించినా ఫలితం లేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 197 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో రేణుకా సింగ్, సోఫీ డివైన్, జార్జియా వేర్‌హామ్ తలో రెండు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
Ashleigh Gardner
Womens Premier League
WPL 2026
Gujarat Giants
UP Warriorz
DY Patil Stadium
Sophie Devine
Phoebe Litchfield
Georgia Wareham

More Telugu News