Prabhas: మిస్ అయిన ప్రభాస్ ఓల్డ్ గెటప్ సన్నివేశాలు యాడ్ చేశారు... మారుతి ఏం చెప్పారంటే..!

Prabhas The Raja Saab Missing Old Look Scenes Added Maruthi
  • 'ది రాజాసాబ్'లో ప్రభాస్ ఓల్డ్ లుక్ మిస్
  • తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అభిమానులు
  • 8 నిమిషాల కొత్త సీన్స్‌ను యాడ్ చేస్తున్నామన్న మారుతి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమాలో ఓల్డ్ గెటప్ కనిపించకపోవడంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ట్రైలర్‌, టీజర్‌లలో చూపించిన ఆ సీన్స్‌నే సినిమాకు హైలెట్‌గా భావించిన ఫ్యాన్స్‌, అవి అసలు మూవీలో లేకపోవడాన్ని జీర్ణించుకోలేక ట్రోలింగ్‌కు దిగారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో దర్శకుడు మారుతి ఈ అంశంపై స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు.


సాంకేతిక కారణాల వల్ల ఆ సీన్స్‌ను మొదట సినిమాలో చేర్చలేకపోయామని మారుతి వెల్లడించారు. అయితే ప్రభాస్ అభిమానుల అంచనాలను గౌరవిస్తూ, వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓల్డ్ గెటప్ సీన్స్‌ను ఇప్పుడు తిరిగి సినిమాలో యాడ్ చేస్తున్నామని తెలిపారు. మొత్తం 8 నిమిషాల కొత్త సీన్స్‌ను జోడిస్తున్నామని, అందులో ప్రభాస్ ఓల్డ్ లుక్ తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌తో పాటు నిర్మాత విశ్వప్రసాద్ కూడా పాల్గొన్నారు.


సినిమా ఫలితాన్ని ఒక్క షో లేదా ఒక్క రోజుతోనే నిర్ణయించకూడదని మారుతి అన్నారు. కనీసం పది రోజులు ఆగితే ‘ది రాజా సాబ్’ అసలు బలమేంటో అర్థమవుతుందని చెప్పారు. సినిమా కొత్త పాయింట్‌పై కొందరు బాగా మాట్లాడుతున్నారని, అర్థమైనవాళ్లు ప్రశంసిస్తుంటే అర్థం కానివాళ్లు విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. టీజర్‌, పోస్టర్లలో ప్రభాస్ ఓల్డ్ లుక్ చూపించినప్పటికీ సినిమాలో అది లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారని అంగీకరించారు.


ఈ రోజు సాయంత్రం 6 గంటల షో నుంచే ఆ సీన్స్‌ను సినిమాకు జోడిస్తున్నామని, సెకండ్ హాఫ్‌లో కొన్ని భాగాలను తొలగించి ఆ స్థానంలో 8 నిమిషాల కొత్త సీన్స్‌ను చేర్చామని చెప్పారు. సెన్సార్ ప్రక్రియ కూడా పూర్తయిందని వెల్లడించారు. ఈ సీన్స్ కోసం ప్రభాస్ ఎంతో కష్టపడ్డారని, అభిమానులు ఆయన్ను ఎలా చూడాలనుకున్నారో అలాగే తెరపై చూపించానని మారుతి పేర్కొన్నారు.


ఇక సామాన్య ప్రేక్షకుల్లో ‘ది రాజా సాబ్’కు మంచి రీచ్ వచ్చిందని దర్శకుడు తెలిపారు. ప్రభాస్‌ను కొత్తగా చూపించాలనే ప్రయత్నం చేశానని, మైండ్ గేమ్‌లా సాగే క్లైమాక్స్ ఇప్పటివరకు రాలేదని చాలామంది చెబుతున్నారని అన్నారు. సినిమా చివరి 40 నిమిషాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయని పేర్కొన్నారు. కొత్త కథలను పెద్ద హీరోలు చేయాలనే ప్రయత్నంలో ప్రభాస్ ముందడుగు వేశారని ప్రశంసించారు.


సినిమా రిజల్ట్ గురించి చాలామంది ఫోన్ చేసి బాధ వ్యక్తం చేసినా, తాను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నానని మారుతి చెప్పారు. కొత్త కాన్సెప్ట్‌ను ప్రేక్షకులు పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు హిట్ కావాలని ఆకాంక్షించారు. తనకు ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సోమవారం నుంచి టికెట్ రేట్లు మళ్లీ నార్మల్ స్థాయికి వస్తాయని వెల్లడించారు.

Prabhas
The Raja Saab
Maruthi
Nidhi Agarwal
Riddhi Kumar
Vishnu Prasad
Prabhas old look
Telugu movie
new scenes added
movie success meet

More Telugu News