Ashleigh Gardner: డబ్ల్యూపీఎల్‌లో నేడు డబుల్ హెడర్... గుజరాత్ జెయింట్స్ భారీ స్కోరు

Ashleigh Gardner Leads Gujarat Giants to Big Score in WPL
  • డబ్ల్యూపీఎల్‌లో యూపీకి గుజరాత్ భారీ లక్ష్యం
  • నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగులు చేసిన గుజరాత్
  • అర్ధశతకంతో మెరిసిన కెప్టెన్ ఆష్లీ గార్డ్‌నర్ (65)
  • భారీ లక్ష్య ఛేదనలో యూపీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ
  • 5 ఓవర్లకు వికెట్ నష్టానికి 34 పరుగులు చేసిన యూపీ వారియర్జ్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 రెండో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో, యూపీ వారియర్జ్‌ ముందు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది.

కెప్టెన్ ఆష్లీ గార్డ్‌నర్ (65; 41 బంతుల్లో, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో అదరగొట్టింది. ఆమెకు తోడుగా అనుష్క శర్మ (44), సోఫీ డివైన్ (38) కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. చివర్లో జార్జియా వేర్‌హామ్ (10 బంతుల్లో 27 నాటౌట్), భారతి ఫుల్మాలి (7 బంతుల్లో 14 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో గుజరాత్ స్కోరు 200 దాటింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎక్లెస్‌టోన్ రెండు వికెట్లు తీయగా, శిఖా పాండే, డయాండ్రా డాటిన్ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కిరణ్ నవ్‌గిరె (1) తొలి ఓవర్‌లోనే పెవిలియన్ చేరింది. ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసేసరికి యూపీ జట్టు ఒక వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ మెగ్ లానింగ్ (20), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (12) ఉన్నారు. యూపీ విజయానికి ఇంకా 90 బంతుల్లో 174 పరుగులు చేయాల్సి ఉంది.

కాగా, డబ్ల్యూపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు (డబుల్ హెడర్) జరుగుతున్నాయి. తొలి మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ తలపడుతుండగా... రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే రెండో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. 


Ashleigh Gardner
WPL 2026
Womens Premier League
Gujarat Giants
UP Warriorz
Sophie Ecclestone
Mumbai Indians
Delhi Capitals
cricket
DY Patil Sports Academy

More Telugu News