Pune real estate: నెల రోజుల్లోనే రూ.20 లక్షల పెంపు.. పూణెలో ఫ్లాట్ కొనుగోలుదారుడి పోస్ట్ వైరల్

20 lakh price hike in Pune flat purchase
  • త్రీబెడ్రూం ఫ్లాట్ కు రూ.1.80 కోట్లు చెప్పిన బిల్డర్
  • నెల తర్వాత మళ్లీ వెళితే అదే ఫ్లాట్ కు రూ. 2 కోట్లు
  • పెరుగుట విరుగుట కొరకేనా? అంటూ ప్రశ్న
భారత దేశంలో రెసిడెన్షియల్ మార్కెట్ బూమ్ కొనసాగుతోందని, ఫ్లాట్ల ధరలు రోజురోజుకూ ఆశ్చర్యకర రీతిలో పెరిగిపోతున్నాయని పూణెకు చెందిన కూనాల్ గాంధీ చెప్పారు. నిజంగా మన దేశంలో డిమాండ్ అంత ఎక్కువగా ఉందా.. లేక మార్కెట్ బూమ్ పేలిపోనుందా? అంటూ ఇటీవల తనకు ఎదురైన ఓ అనుభవాన్ని ఎక్స్ లో పంచుకున్నారు. పూణెలో సొంతింటిని సమకూర్చుకోవడం కోసం తాను కొంతకాలంగా ప్రయత్నిస్తున్నానని, ఓ ఫ్లాట్ కొనుగోలు చేయాలని చూస్తున్నానని చెప్పారు.

సుమారు నెల రోజుల క్రితం ఓ ప్రాజెక్ట్ సైట్ కు వెళ్లి ధరల గురించి వాకబు చేశానని చెప్పారు. వాకడ్ ఏరియాలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో త్రీబెడ్రూం ఫ్లాట్ కు రూ.1.80 కోట్లు చెప్పారన్నారు. ఇంట్లో వారితో చర్చించాక ఏ విషయం చెబుతానని అక్కడి నుంచి వచ్చేశానని, ఇంకాస్త తక్కువ ధరలో ఎక్కడైనా ఫ్లాట్ దొరుకుతుందేమోనని విచారించానన్నారు. నెల రోజుల తర్వాత మళ్లీ అదే ఫ్లాట్ కోసం వెళితే రూ.2 కోట్లు చెప్పారన్నారు. జస్ట్ నెల రోజుల్లో రూ.20 లక్షలు పెంచడమేంటని అడిగితే.. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ధరలు పెరుగుతున్నాయని వారు జవాబిచ్చారని కూనాల్ చెప్పారు.

మరో వారం పది రోజుల్లో ఇదే ఫ్లాట్ ధర రూ.2.15 కోట్లకు చేరుతుందని, చుట్టుపక్కల ఏరియాల్లోనూ ఇదే రీతిలో ధరలు పెరుగుతున్నాయని వివరించారని అన్నారు. ఈ ధరల పెంపు చూస్తుంటే.. పెరుగుట విరుగుట కొరకేనా? అనే సందేహం వస్తోందన్నారు. కూనాల్ గాంధీ పోస్టు ఎక్స్ లో వైరల్ గా మారింది. యూజర్లు స్పందిస్తూ.. రెసిడెన్షియల్ మార్కెట్లో నిజంగానే డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని కొందరు, ఈ స్థాయిలో ధరలు పెంచేంతగా డిమాండ్ లేదని, ఇది కచ్చితంగా బూమ్ మాత్రమేనని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
Pune real estate
property prices India
Wakad property
Indian housing market
real estate boom
residential property prices
Pune property rates
home buying India
Kunal Gandhi

More Telugu News