Toll Fee: సంక్రాంతి రద్దీకి చెక్.. హైదరాబాద్-విజయవాడ హైవేపై కొత్త ప్రయోగం.. ఆగకుండానే టోల్ చెల్లింపు!

NHAI New Toll System on Hyderabad Vijayawada Highway for Sankranti
  • సంక్రాంతి రద్దీని తగ్గించేందుకు పంతంగి టోల్ ప్లాజా వద్ద కొత్త టెక్నాలజీ
  • శాటిలైట్, కెమెరాలతో ఆటోమేటిక్‌గా టోల్ వసూలుపై ట్రయల్ రన్
  • ట్రయల్స్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు గుర్తింపు.. పరిష్కారంపై అధికారుల దృష్టి
  • హైవేపై టోల్ ఫీజు మినహాయింపునకు కేంద్ర ప్రభుత్వం నిరాకరణ
  • రద్దీ దృష్ట్యా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసే యోచన
సంక్రాంతి పండుగ ప్రయాణాలు మొదలవడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఏటా కిలోమీటర్ల మేర నిలిచిపోయే ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఈసారి ఒక నూతన టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. వాహనాలు ఆగకుండానే, కేవలం మూడు సెకన్లలో టోల్ వసూలు చేసేందుకు వీలుగా శాటిలైట్ ఆధారిత ఆటోమేటిక్ విధానాన్ని పరీక్షిస్తోంది. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద నిన్న సాయంత్రం ట్రయల్ రన్ నిర్వహించారు.

విజయవాడ వైపు వెళ్లే 8 టోల్ బూత్‌లలో ఈ ట్రయల్ రన్ చేపట్టారు. ఈ విధానంలో కెమెరాలు వాహనం నంబర్ ప్లేట్‌ను గుర్తించగానే, సెన్సార్లు ఫాస్టాగ్‌ను స్కాన్ చేసి ఆటోమేటిక్‌గా టోల్ రుసుమును వసూలు చేస్తాయి. ఈ పరీక్షల సమయంలో కొన్ని వాహనాలకు టోల్ ఫీజు సరిగ్గా కట్ కాకపోవడం వంటి సాంకేతిక సమస్యలను అధికారులు గుర్తించారు. పండుగ రద్దీ ప్రారంభమయ్యేలోపు ఈ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు ఎన్‌హెచ్ఏఐ, టోల్ ప్లాజా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

సంక్రాంతికి ఊహించిన దానికంటే ఎక్కువ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున, విజయవాడ మార్గంలో అదనంగా మరో రెండు టోల్ బూత్‌లను తెరవాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ కౌంటర్లలో మాత్రం హ్యాండ్‌గన్‌లతో ఫాస్టాగ్‌లను స్కాన్ చేసి టోల్ వసూలు చేస్తారు. ఈ విధానాన్ని కూడా ట్రయల్ రన్‌లో పరీక్షించారు. ప్రస్తుతం హైదరాబాద్-విజయవాడ హైవేపై కేవలం పంతంగి వద్ద మాత్రమే ఈ కొత్త టెక్నాలజీని అమలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే... పండుగ సందర్భంగా జనవరి 9 నుంచి 18 వరకు హైదరాబాద్-విజయవాడ హైవేపై టోల్ ఫీజు రద్దు చేయాలని తెలంగాణ ఆర్‌ అండ్‌ బీ శాఖ కేంద్రాన్ని కోరింది. అయితే, ఈ అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం. టోల్ మినహాయింపు సాధ్యం కాదని తెలియజేసినట్లు తెలుస్తోంది.
Toll Fee
NHAI
Hyderabad Vijayawada Highway
Sankranti
Pantangi Toll Plaza
Toll Collection
Fastag
National Highway Authority of India
Automatic Toll System
Telangana R and B

More Telugu News