Chandrababu Naidu: నేను తెచ్చిన ఈ వ్యవస్థ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచింది: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu DWCRA System An Ideal For The Nation
  • గుంటూరులో సరస్ మేళా 2026ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
  • మహిళల ఆర్థిక ప్రగతి కోసం తాను తెచ్చిన డ్వాక్రా వ్యవస్థ దేశానికే ఆదర్శమన్న సీఎం
  • ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని వెల్లడి
  • కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందని స్పష్టీకరణ
  • పొదుపు సంఘాలకు వేల కోట్ల రూపాయల విలువైన రుణాల చెక్కుల పంపిణీ
మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడాలనే సదుద్దేశంతో 30 ఏళ్ల క్రితం తాను ప్రారంభించిన డ్వాక్రా (పొదుపు సంఘాల) వ్యవస్థ, నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పొదుపు సంఘాల ద్వారా మహిళలు సాధించిన ఆర్థిక స్వావలంబన చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. గురువారం గుంటూరులో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'సరస్ మేళా 2026'ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.

అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "డ్వాక్రా సంఘాలను చూస్తే నా గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. 30 ఏళ్ల క్రితం మహిళలు సమావేశాల కోసం బయటకు వస్తే ఎగతాళి చేసిన వారే, ఇప్పుడు వారి ప్రగతిని చూసి అభినందిస్తున్నారు. ఈ రోజు డ్వాక్రా సంఘాలు తిరుగులేని వ్యవస్థగా రికార్డు సృష్టించాయి. రాష్ట్రంలో కోటీ 13 లక్షల మంది డ్వాక్రా మహిళలు రూ. 26 వేల కోట్ల నిధిని, రూ. 5,200 కోట్ల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవడం వారి పట్టుదలకు నిదర్శనం. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే రూ. 46,590 కోట్ల బ్యాంకు రుణాలు పొందారంటే వారి ఆర్థిక క్రమశిక్షణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు" అని వివరించారు. 

ఈ ప్రదర్శన మినీ ఇండియాను తలపిస్తోందని, పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. దేశ రాజధానిలో జరిగే ఇలాంటి కార్యక్రమాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను చంద్రబాబు అభినందించారు.

ఆడబిడ్డలతో టీడీపీకి ప్రత్యేక అనుబంధం

తెలుగుదేశం పార్టీకి ఆడబిడ్డలతో ఉన్నది ప్రత్యేక అనుబంధమని చంద్రబాబు గుర్తుచేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆనాడే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని, వారి ఉన్నత విద్య కోసం తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించానన్నారు. రాష్ట్రంలో 89 లక్షల మంది డ్వాక్రా, 24 లక్షల మంది మెప్మా సంఘాల సభ్యులున్నారని తెలిపారు. 

తాను ఇచ్చిన ఐటీ పిలుపుతో ఎంతోమంది ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని, ఇప్పుడు ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటికే 93 వేల మంది సూక్ష్మ, చిన్న తరహా పారిశ్రామికవేత్తలుగా మారారని, డ్వాక్రా మహిళలు విదేశాలకు వెళ్లి శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగారని కొనియాడారు.

సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం

ముఖ్యమంత్రి అంటే పెత్తందారు కాదని, ప్రజలకు సేవ చేసే సేవకుడని చంద్రబాబు అన్నారు. తమ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పనిచేస్తోందని తెలిపారు. 'తల్లికి వందనం' కింద ఏటా రూ.10,090 కోట్లను 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని, 'స్త్రీ శక్తి' పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. 'దీపం' పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామన్నారు. 'సంజీవని' కార్యక్రమంతో రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తామని, పేదరికం లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, స్త్రీ నిధి పథకం కింద డ్వాక్రా సంఘాలకు రూ. 1,375 కోట్ల చెక్కును, సెర్ప్ ద్వారా మరో రూ. 2,171 కోట్ల రుణాలను సీఎం పంపిణీ చేశారు. చేనేత వస్త్రాల స్టాల్స్‌ను సందర్శించిన ఆయన, తన అర్ధాంగి భువనేశ్వరి కోసం ఒక చీరను కొనుగోలు చేశారు. తన భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఓ మహిళ విన్నవించుకోగా, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తక్షణమే రూ. 6 లక్షలు మంజూరు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
Chandrababu Naidu
DWCRA
Guntur
SARAS Mela 2026
Women Empowerment
Andhra Pradesh
Self Help Groups
Pemmmasani Chandrasekhar
TDP
Stree Nidhi

More Telugu News