Mega DSC: మెగా డీఎస్సీలో టీచర్​గా ఎంపికైన మూడు నెలలకే రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Road Accident Kills Teacher Venkata Ratnam and Husband in Khammam
  • ఖమ్మం జిల్లా వైరా రోడ్డు ప్రమాదంలో విషాదం
  • చిరు వ్యాపారం చేస్తున్న భర్త.. కష్టపడి చదివి ప్రభుత్వ టీచర్ గా ఎంపికైన భార్య
  • తల్లిదండ్రుల మృతితో అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలు
చిరు వ్యాపారంతో కుటుంబాన్ని పోషిస్తున్న భర్తకు అండగా నిలవాలని భావించిందో ఇల్లాలు.. కష్టపడి చదివి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎంపికైంది. ఇక తమకు మంచి రోజులు వచ్చాయని, కష్టాలు కడతేరాయని ఆ భార్యాభర్తలు సంతోషించారు. అయితే, ఉద్యోగంలో చేరిన మూడు నెలలకే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారిని కబళించింది. ఖమ్మం జిల్లా వైరా పట్టణం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా రాజాం గ్రామానికి చెందిన వడ్డాది రాము(44), వెంకటరత్నం(37) దంపతులు వైరా పట్టణంలో నివసిస్తున్నారు. వారి పెద్ద కొడుకు ఓం సాయి వికాస్ పదో తరగతి, రెండో కొడుకు పార్థు ఏడో తరగతి చదువుతున్నారు. ట్రాలీ ఆటోలో రాము చిరు వ్యాపారం చేస్తుండగా.. వెంకటరత్నం ఇటీవలే ప్రభుత్వ టీచర్ గా ఎంపికయ్యారు.

మెగా డీఎస్సీలో ఉద్యోగం సాధించి జగ్గయ్యపేట గురుకుల గిరిజన పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఆమె విధుల్లో చేరారు. మంగళవారం రాత్రి వెంకటరత్నంతో కలిసి రాము ట్రాలీ ఆటోలో వెళుతుండగా.. సోమవారం గ్రామ సమీపంలో ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వెంకటరత్నం అక్కడికక్కడే మరణించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం రాము కన్నుమూశాడు. తల్లిదండ్రులు మరణించడంతో పిల్లలు అనాథలయ్యారు.
Mega DSC
Teacher death
Road accident
Khammam district
Andhra Pradesh
Government teacher
Venkata Ratnam
Jaggayyapeta Gurukula School
Vaddadi Ramu
Vaira

More Telugu News