Kalisetti Appalanaidu: భోగాపురం ఎయిర్‌పోర్టుకు కర్త, కర్మ, క్రియ చంద్రబాబే... జగన్ ఆ క్రెడిట్ కొట్టేయాలనుకోవడం హాస్యాస్పదం: ఎంపీ కలిశెట్టి

Kalisetti Criticizes Jagan Over Bhogapuram Airport Credit
  • భోగాపురం క్రెడిట్ జగన్‌ది కాదు.. చంద్రబాబుదన్న టీడీపీ ఎంపీ
  • భోగాపురంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని వైసీపీకి సవాల్
  • గతంలో ఎగతాళి చేసి ఇప్పుడు క్రెడిట్ కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా
  • అవినీతి, విధ్వంసమే జగన్‌కు ఉన్న క్రెడిట్ అని తీవ్ర వ్యాఖ్యలు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కర్త, కర్మ, క్రియ అన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని, అలాంటిది ఆ క్రెడిట్ తనదేనని జగన్ చెప్పుకోవడం అత్యంత హాస్యాస్పదంగా ఉందని విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా విమర్శించారు. కేవలం కొబ్బరికాయ కొట్టగానే క్రెడిట్ వచ్చేయదని జగన్ గ్రహించాలని హితవు పలికారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

2014-19 మధ్య చంద్రబాబు భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేస్తే, ఆ తర్వాత ఐదేళ్లపాటు జగన్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తిగా మూలన పడేసిందని అప్పలనాయుడు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 18 నెలల్లోనే ప్రధాని మోదీ సహకారంతో 95 శాతం పనులు పూర్తి చేసిందని, జనవరి 4న తొలి విమానం ల్యాండ్ అయిందని గుర్తుచేశారు. మరో ఐదారు నెలల్లో, జూన్ నాటికి విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో ప్రజలకు అంకితం చేయనున్న తరుణంలో, జగన్ ట్వీట్ చేసి క్రెడిట్ తీసుకోవాలని చూడటం విడ్డూరంగా ఉందన్నారు.

ఈ విషయంపై గూడుపువలస, భోగాపురం, పులివెందుల లేదా రాష్ట్రంలో ఎక్కడైనా బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, వైసీపీ నేతలు సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు. ఎవరి హయాంలో అనుమతులు వచ్చాయి, ఎవరు పనులను ఆటంకపరిచారో తేల్చుకుందామన్నారు. "గతంలో 'ఎర్రబస్సు రాని భోగాపురానికి ఎయిర్‌పోర్టా?' అని, 'విశాఖ ఎయిర్‌పోర్టుకు దోమలు, ఈగలు వస్తాయి గానీ మనుషులొస్తారా?' అని హేళన చేసి ఉత్తరాంధ్ర ప్రజలను అవమానించిన జగన్, ఇప్పుడు అదే ప్రాజెక్టుకు తానే కర్తనని చెప్పుకోవడం సిగ్గుచేటు" అని మండిపడ్డారు.

"కమీషన్ల కోసం జీఎంఆర్ సంస్థకు పనులు కట్టబెట్టారని గతంలో చంద్రబాబుపై జగన్ ఆరోపణలు చేశారు. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక అదే జీఎంఆర్ సంస్థకు టెండర్లు ఇవ్వలేదా? ఇది జగన్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మేం ఒకే మాట మీద ఉంటాం" అని అప్పలనాయుడు స్పష్టం చేశారు. గూగుల్, ఐటీ, విజనరీ, డెవలప్‌మెంట్ అంటే చంద్రబాబే గుర్తుకొస్తారని, అవినీతి, విధ్వంసం, దోపిడీ అంటే జగన్ గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు. "జగన్‌కు ఉన్నది క్రిమినల్ మైండ్. ఆ క్రెడిట్‌ను ఎవరూ కోరుకోరు, దొంగిలించలేరు. దొంగిలిస్తే జైలుకు పోక తప్పదు" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, అభివృద్ధి పనుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే జగన్ ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజమయ్యే రోజులు పోయాయని, ఇప్పటికైనా జగన్ జ్ఞానోదయం పొంది వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ ఛైర్మన్ వరకు అన్ని ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే విజయమని, ప్రజలు కూటమి పాలనను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని అప్పలనాయుడు ధీమా వ్యక్తం చేశారు.
Kalisetti Appalanaidu
Bhoga puram Airport
Chandrababu Naidu
Jagan Mohan Reddy
Andhra Pradesh Politics
TDP
YSRCP
Vizianagaram
GMR Group
Airport Construction

More Telugu News