ఓటీటీలోకి అఖండ-2... ఎప్పటి నుంచి అంటే...!
- బాలకృష్ణ ‘అఖండ 2’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లోకి!
- సంక్రాంతి కానుకగా జనవరి 9 నుంచి స్ట్రీమింగ్
- బయోవార్ నేపథ్యంతో సాగే ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్
- బోయపాటి దర్శకత్వం.. పలు భాషల్లో డబ్బింగ్ వెర్షన్లు
- థియేటర్లలో మిశ్రమ స్పందన పొందిన చిత్రం
గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అభిమానుల నుంచి మంచి స్పందనను అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఓటీటీ ద్వారా మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ డబ్బింగ్ వెర్షన్లు అందుబాటులో ఉంటాయని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఈ చిత్రంలో అఘోరాగా బాలకృష్ణ నటన, ఆయన పలికిన సంభాషణలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కుంభమేళాను లక్ష్యంగా చేసుకుని దేశంపై శత్రువులు పన్నిన బయోవార్ కుట్రను అఘోరా ఎలా ఎదుర్కొన్నాడు అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. సనాతన ధర్మ పరిరక్షణ ఇతివృత్తంగా సాగే ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. ఆయన సరసన సంయుక్త మీనన్ నటించగా, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా ముఖ్య పాత్రలు పోషించారు. బాలయ్య మార్క్ యాక్షన్, అఘోరా పాత్ర కోసం ఈ సినిమాను పండగ సెలవుల్లో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.