Revanth Reddy: దేవుడి మీద ఒట్టు... ఇదే నా కమిట్ మెంట్: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Swears Commitment to Telangana on God
  • కేసిఆర్ మాటలతోనే చంద్రబాబు బనకచర్ల ప్రతిపాదన చేశారన్న సీఎం రేవంత్ రెడ్డి
  • తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా తాను ఎప్పటికీ వ్యవహరించనని వెల్లడి
  • తనకు సొంత ప్రాంత ప్రయోజనాల తర్వాతనే పార్టీ అని పేర్కొన్న రేవంత్ రెడ్డి
గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభ వేదికగా ఘాటుగా సమాధానమిచ్చారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా తాను ఎప్పటికీ వ్యవహరించనని స్పష్టం చేస్తూ, గత పాలకుల నిర్ణయాలే నేటి వివాదాలకు కారణమని వివరించారు. నీళ్లు – నిజాలు అనే అంశంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం రేవంత్ రెడ్డి గోదావరి జలాలు, బనకచర్ల ప్రాజెక్టు, కృష్ణా జలాల పంపకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
 
గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలంటూ 2016లోనే జల్‌శక్తిశాఖ సమావేశంలో అప్పటి సీఎం కేసీఆర్‌ మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్‌ చెప్పిన మాటలతోనే చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు ఆలోచన చేశారని పేర్కొన్నారు. కేంద్ర జల్‌శక్తిశాఖ నిర్వహించిన సమావేశాలకు కేసీఆర్‌ రెండు సార్లు హాజరయ్యారని గుర్తుచేశారు. కృష్ణా జలాల పంపకాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు కేసీఆర్‌ అంగీకరించి, ట్రైబ్యునల్‌ తుది తీర్పు వచ్చే వరకూ అదే కొనసాగిస్తామని సంతకం చేశారన్నారు. 2020లో వాటా పెంచుకునే అవకాశం వచ్చినా అప్పటి ప్రభుత్వం ఉపయోగించుకోలేదని విమర్శించారు.
 
నాకు నా ప్రాంతమే ముఖ్యం. ఆ తర్వాతనే పార్టీ. అందుకే అప్పట్లో బయటకు వచ్చా. సీఎం కుర్చీలో కూర్చొని తెలంగాణకు అన్యాయం జరిగేలా నేను ఎప్పుడూ ప్రవర్తించను’’ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను ఆపించిన చరిత్ర తమదేనని తెలిపారు. ఆ పనులు నిలిపివేస్తేనే చర్చలకు వస్తామని స్పష్టమైన షరతు పెట్టామని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిజంగా ఆగిందో లేదో నిజనిర్ధారణ కమిటీ ద్వారా విచారణ చేయించుకోవచ్చని సవాల్‌ విసిరారు.
 
‘‘చచ్చినా.. బతికినా.. తెలంగాణ కోసమే. ఇదే నా కమిట్‌మెంట్‌. దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. తెలంగాణకు అన్యాయం జరగనివ్వను’’ అని సభలో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంగా ప్రకటించారు.
Revanth Reddy
Telangana
Godavari River
Krishna River
Banakacherla Project
KCR
Rayalaseema Lift Irrigation
Water Sharing
Telangana Politics

More Telugu News