Nagpur Child Abuse: బాలుడిని 2 నెలలుగా గొలుసుతో కట్టేసిన తల్లిదండ్రులు!

Child Chained by Parents in Nagpur for Stealing Phones
  • సౌత్ నాగ్ పూర్ లో దారుణం.. పోలీసులకు స్థానికుల ఫిర్యాదు
  • జిల్లా మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారుల తనిఖీ
  • ఇంటిముందు స్తంభానికి కట్టేసిన బాలుడిని విడిపించిన అధికారులు
  • జువైనల్ యాక్ట్ కింద తల్లిదండ్రులపై కేసు నమోదు
పన్నెండేళ్ల బాలుడి పట్ల తల్లిదండ్రులు అమానుషంగా ప్రవర్తించిన ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటుచేసుకుంది. ఇంట్లో నుంచి పారిపోతున్నాడని, సెల్ ఫోన్లు దొంగిలిస్తున్నాడనే ఆరోపణలతో తల్లిదండ్రులే ఆ బాలుడిని ఇనుప గొలుసులతో కట్టేశారు. కూలి పనులు చేసి పొట్టపోసుకునే ఆ తల్లిదండ్రులు.. ఉదయాన్నే పనికి వెళుతూ కొడుకును ఇంటి బయట గొలుసులతో బంధించి, తాళాలు వేస్తుంటారు. సాయంత్రం తిరిగి వచ్చాకే గొలుసులు తీస్తారు. దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ దారుణం తాజాగా స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

సౌత్ నాగ్ పూర్ లోని ఓ పన్నెండేళ్ల బాలుడు స్కూలుకు వెళ్లకుండా ఆవారాగా తిరుగుతున్నాడు. ఇంట్లో నుంచి తరచూ చెప్పాపెట్టకుండా వెళ్లిపోయేవాడు. ఈ క్రమంలోనే కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన తల్లిదండ్రులు.. రోజూ బాలుడిని ఇంటిముందు ఇనుప గొలుసులతో బంధించి పనికివెళ్లేవారు. సాయంత్రం తిరిగి వచ్చాక గొలుసులు ఊడదీసేవారు. బయటకు వెళ్లి ఇతరుల ఫోన్లు దొంగతనం చేస్తున్నాడని, మందలించినా వినడం లేదని వారు చెబుతున్నారు.

గొలుసులతో కట్టేయడం వల్ల బాలుడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. బాలుడి పరిస్థితిని గమనించిన చుట్టుపక్కల వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారులు అక్కడికి చేరుకుని బాలుడిని విడిపించారు. భయాందోళనలతో ఉన్న బాలుడిని షెల్టర్ హోమ్ కు తరలించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. బాలుడి పట్ల అమానుషంగా ప్రవర్తించిన తల్లిదండ్రులపై జువైనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
Nagpur Child Abuse
Child chained
Maharashtra child abuse
Juvenile Justice Act
Child Welfare
Child labor India
Domestic abuse India
Child protection India

More Telugu News