Pregnant death: ఆరు కి.మీ. నడవడంతో అస్వస్థతకు గురై గర్భిణి మృతి.. గడ్చిరోలిలో విషాదం

Tragedy in Gadchiroli Pregnant Woman Dies After Walking 6km to Hospital
  • ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లే క్రమంలో దారుణం
  • రవాణా, వైద్య సదుపాయం లేకపోవడమే కారణం
  • రక్తస్రావంతో కడుపులోని బిడ్డ.. హైబీపీతో తల్లి మృత్యువాత
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో విషాదం చోటుచేసుకుంది. ప్రసవం కోసం కాలినడకన ఆసుపత్రికి బయలుదేరిన నిండు గర్భిణి మృత్యువాత పడింది. రోడ్డు మార్గంలేక ఆరు కిలోమీటర్లు నడవడంతో రక్తస్రావం జరిగి కడుపులోని బిడ్డ, హైబీపీ కారణంగా తల్లి చనిపోయారు. ఈ విషాదకర సంఘటనకు సంబంధించిన వివరాలు..

గడ్చిరోలి జిల్లా ఎటపల్లి తాలూకాలోని ఆల్దండి టోలో గ్రామానికి చెందిన ఆశా సంతోష్‌ కిరంగ (24) నిండు గర్భిణి. మారుమూల ప్రాంతం కావడంతో సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. దీంతో ఆమె ప్రసవం కోసం పెథాలోని తన సోదరి ఇంటికి బయలుదేరింది. అటవీ మార్గం గుండా భర్తతో కలిసి సుమారు 6 కిలోమీటర్లు నడిచి సోదరి ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో కిరంగకు పురిటి నొప్పులు మొదలయ్యాయి.

వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. నడక కారణంగా రక్తస్రావం జరిగి కడుపులో బిడ్డ చనిపోయింది. ఆ తర్వాత హైబీపీ కారణంగా కిరంగ కూడా మరణించింది. కిరంగను కాపాడేందుకు వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్‌ ప్రతాప్‌ షిండే పేర్కొన్నారు. వైద్య సదుపాయంతో పాటు రవాణా సదుపాయం లేకపోవడం వల్లే కిరంగ మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, కిరంగ మృతిపై విచారణ జరిపిస్తామని అధికారులు పేర్కొన్నారు.
Pregnant death
Gadchiroli
Maharashtra
maternal death
tribal area
lack of roads
ambulance access
high blood pressure
pregnancy complications
Etapalli
Asha Kirang

More Telugu News