Kishan Naik: పిల్లల అన్నంలో విషం కలిపి చంపేయండి.. సిబ్బందిని ఆదేశించిన వార్డెన్

Warden Kishan Naik Orders Poisoning of Students Food in Sangareddy
  • తనపై ఫిర్యాదు చేశారన్న కోపంతో విద్యార్థులను చంపాలని వార్డెన్ హుకుం
  • అన్నంలో విషం కలపాలంటూ హాస్టల్ సిబ్బందికి ఫోన్ చేసిన వార్డెన్ కిషన్ నాయక్
  • ఆడియో వైరల్ కావడంతో వార్డెన్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్
  • సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎస్సీ బాలుర వసతి గృహంలో ఘటన
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లోని ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహంలో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, వారిని వేధిస్తున్న వార్డెన్ కిషన్ నాయక్ ఏకంగా వారిని అంతమొందించాలని చూడటం సంచలనం సృష్టించింది. వార్డెన్ తీరుపై విసిగిపోయిన విద్యార్థులు గురువారం రాత్రి కడ్పల్-సిర్గాపూర్ రహదారిపై ఆందోళనకు దిగారు. అధికారులు హాస్టల్‌కు వచ్చి విచారణ జరపగా, విద్యార్థులు వార్డెన్‌పై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

దీంతో ఆగ్రహానికి గురైన వార్డెన్, శుక్రవారం ఉదయం మద్యం మత్తులో వసతి గృహానికి చేరుకుని విద్యార్థులపై బూతులతో రెచ్చిపోయాడు. అంతటితో ఆగకుండా, హాస్టల్ సిబ్బందికి ఫోన్ చేసి.. "నా మీదనే ఫిర్యాదు చేస్తారా? వాళ్ల అన్నంలో విషం కలిపి చంపేయండి" అంటూ ఆదేశాలు జారీ చేశాడు. ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ బయటకు రావడంతో సర్వత్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ ఉదంతంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తక్షణమే స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడమే కాకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడాలని చూసిన వార్డెన్ కిషన్ నాయక్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  
Kishan Naik
Sangareddy
Sirgapur
SC Welfare Hostel
Warden Suspended
Poison in Food
Student Protest
Hostel Issues
Telangana News
Corruption

More Telugu News