YS Sharmila: చంద్రబాబు మౌనంగా ఉండడం దారుణం: షర్మిల

YS Sharmila Slams Chandrababu for Silence on NREGA
  • ఉపాధి హామీపై కేంద్రం కుట్ర పన్నుతోందని షర్మిల ఆరోపణ
  • సీఎం చంద్రబాబు ఏమీ మాట్లాడడం లేదంటూ తీవ్ర విమర్శలు
  • 'జీ రామ్ జీ' చట్టంతో రాష్ట్రంపై రూ.4,500 కోట్ల భారం పడుతుందని వెల్లడి
  • మోదీ చేతిలో చంద్రబాబు తోలుబొమ్మలా మారారంటూ ఘాటు వ్యాఖ్యలు
  • కొత్త చట్టాన్ని రద్దు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కూటమికి డిమాండ్
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపైనా, కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై (NREGA) కేంద్రం కుట్రలు చేస్తుంటే, సీఎం చంద్రబాబు మౌనంగా ఉండటం దారుణమని ఆమె మండిపడ్డారు. బీజేపీ తెస్తున్న నల్ల చట్టాలకు రాష్ట్ర ప్రభుత్వం చప్పట్లు కొట్టడం అత్యంత సిగ్గుచేటని విమర్శించారు.

షర్మిల మాట్లాడుతూ, "గ్రామీణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపాధి హామీ పథకం ఊతమిచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దేశంలోనే తొలి జాబ్ కార్డును మన రాష్ట్రంలోనే అందించాం. ఈ పథకం ద్వారా ఏటా 80 లక్షల మంది పేదలకు ఉపాధి హక్కుగా మారింది" అని వెల్లడించారు. దేశంలోనే ఈ పథకాన్ని సమర్థంగా వినియోగించుకుంటున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని తెలిసినా, కేంద్రం 'జీ రామ్ జీ' పేరుతో కొత్త చట్టం తీసుకొచ్చి దానికి గండి కొడుతోందని ఆరోపించారు. ఈ అక్రమ చట్టంతో రాష్ట్రంపై ఏటా రూ.4,500 కోట్ల భారం పడుతుందని, ఈ నిజాన్ని తెలిసి కూడా చంద్రబాబు ఏమీ మాట్లాడకుండా ఉండడం బాధాకరమన్నారు.

"గోరుచుట్టుపై రోకలి పోటులా ఈ కొత్త చట్టం మారింది. ఇప్పటికే ప్రతినెలా జీతాలు ఇవ్వడానికే అప్పులు చేసే ప్రభుత్వం, ఈ పథకానికి అవసరమైన 40 శాతం నిధులను ఎక్కడి నుంచి తెస్తుంది?" అని షర్మిల ప్రశ్నించారు. నిరుద్యోగంలో నంబర్ వన్ గా ఉన్న రాష్ట్రంలో ఉపాధికి ఉరి పెడుతుంటే ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. "మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేక మోదీ చేతిలో తోలుబొమ్మనా?" అని చంద్రబాబును ఉద్దేశించి ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఉపాధి హామీ పథకానికి ఊపిరి తీస్తున్న 'జీ రామ్ జీ' చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కూటమి పార్టీలను ఆమె కోరారు. పాత నరేగా చట్టాన్ని పునరుద్ధరించేలా బేషరతుగా మద్దతు పలకాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, కూటమి పార్టీల నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఎండగడుతుందని షర్మిల హెచ్చరించారు.


YS Sharmila
Andhra Pradesh
Chandrababu Naidu
NREGA
MGNREGA
employment guarantee scheme
G Ram G Act
Congress Party
unemployment
central government

More Telugu News