Mustafizur Rahman: కేకేఆర్ కొనుగోలు చేసిన ముస్తాఫిజుర్‌పై రగడ... బీసీసీఐ ఏమన్నదంటే?

BCCI Responds to Controversy Over KKR Buying Mustafizur Rahman
  • ఐపీఎల్‌లో బంగ్లా ఆటగాళ్ల ప్రాతినిధ్యంపై స్పందించిన బీసీసీఐ
  • ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని వెల్లడి
  • ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ కొనుగోలు చేయడంపై చెలరేగిన వివాదం
  • బంగ్లాలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో వచ్చిన విమర్శలు
  • క్రీడలను రాజకీయాలతో కలపవద్దని పలువురు నేతల అభిప్రాయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్ల ప్రాతినిధ్యంపై విమర్శలు వస్తుండడం పట్ల బీసీసీఐ స్పందించింది. బంగ్లా ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడకుండా నిరోధించాలని ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ అంశంపై ప్రస్తుతానికి తాము వ్యాఖ్యానించలేమని తెలిపాయి.

గత నెలలో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో అతను ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బంగ్లా ఆటగాడిగా నిలిచాడు. అయితే, బంగ్లాదేశ్‌లో మతపరమైన మైనారిటీలపై హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్న నివేదికల నేపథ్యంలో ఒక బంగ్లా ఆటగాడిని తీసుకోవడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అతని ఐపీఎల్ ప్రాతినిధ్యంపై చర్చ మొదలైంది.

ఈ అంశంపై బీసీసీఐకి చెందిన ఒక అధికారి ఐఏఎన్ఎస్‌తో మాట్లాడుతూ.. "ఈ విషయంలోకి  వెళ్లొద్దు. ఇది మా చేతుల్లో లేదు. బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడకుండా నిరోధించాలని ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రస్తుతానికి దీనిపై ఎక్కువగా వ్యాఖ్యానించలేం" అని తెలిపారు.

ఈ వివాదంపై ఆధ్యాత్మిక గురువు దేవకీనందన్ ఠాకూర్ ఇటీవల కేకేఆర్, దాని సహ యజమాని షారుఖ్ ఖాన్‌పై విమర్శలు చేశారు. పొరుగు దేశంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని వస్తున్న వార్తల నడుమ బంగ్లా ఆటగాడిని తీసుకోవడం సనాతన ధర్మాన్ని పాటించే వారి మనోభావాలను దెబ్బతీసిందని ఆయన అన్నారు. 

అయితే, క్రీడలను రాజకీయ, దౌత్యపరమైన అంశాలకు దూరంగా ఉంచాలని పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. ముస్తాఫిజుర్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
Mustafizur Rahman
KKR
BCCI
IPL 2026
Bangladesh Cricket
Shah Rukh Khan
Devkinandan Thakur
Kolkata Knight Riders
IPL Auction
Cricket Controversy

More Telugu News