Anti National Song: మహారాష్ట్రలోని ఆలయం వద్ద 'కశ్మీర్ బనేగా పాకిస్థాన్' పాట.. యువకుడి అరెస్ట్

Man arrested for playing anti national song on loudspeaker near temple in Palghar
  • ఆలయం ఎదురుగా వున్న సెలూన్‌లో లౌడ్‌స్పీకర్‌లో ప్లే చేసిన యువకుడు
  • దేశ సమగ్రతకు భంగం కలిగించారంటూ కేసు నమోదు, అరెస్ట్
  • దుర్గామాత ఆలయం వద్ద ఘటనతో ఉద్రిక్తత
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. చిన్చోటి ప్రాంతంలోని ఓ ఆలయం సమీపంలో దేశ వ్యతిరేక, రెచ్చగొట్టే పాటలు ప్లే చేసినందుకు గాను 25 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసిన ఈ ఘటనపై నాయిగావ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ సమగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరించిన సదరు యువకుడిపై కఠిన చర్యలు తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాయిగావ్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ పంకజ్ కిల్జే మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. కరమ్‌పాడలోని దుర్గామాత ఆలయానికి ఎదురుగా ఉన్న 'రుహాన్ హెయిర్ కటింగ్ సెలూన్' నుంచి పెద్ద శబ్దంతో పాటలు వినిపించాయి. నిశితంగా పరిశీలించగా.. అది 'కశ్మీర్ బనేగా పాకిస్థాన్' (కశ్మీర్ పాకిస్థాన్‌గా మారుతుంది) అనే రెచ్చగొట్టే పాట అని గుర్తించారు. బ్లూటూత్ ద్వారా స్పీకర్లకు కనెక్ట్ చేసి మరీ ఈ పాటను ప్లే చేస్తున్నట్లు తేలింది.

సెలూన్ లోపల తనిఖీ చేయగా.. ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌కు చెందిన అబ్దుల్ రెహమాన్ సద్రుద్దీన్ షా (25) తన 'టెక్నో స్పార్క్ గో 2021' మొబైల్ ద్వారా యూట్యూబ్‌లో ఈ పాటను ప్లే చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గుడి సమీపంలో ఇలాంటి దేశ వ్యతిరేక పాటలు వినిపించడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అబ్దుల్ రెహమాన్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

దేశ సమగ్రతకు భంగం కలిగించడం, ప్రజల్లో శాంతిభద్రతల సమస్యలు సృష్టించడం వంటి అభియోగాలపై అబ్దుల్ రెహమాన్‌పై  బీఎన్ఎస్ సెక్షన్ 197(1)(d) కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే సెలూన్‌లో పనిచేస్తున్న మరో వ్యక్తిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను, జాతీయ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలను ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు.
Anti National Song
Abdul Rehman
Kashmir Banega Pakistan
Palghar
Maharashtra
Communal Harmony
Naigaon Police
India
Pakistan
Crime

More Telugu News