Amani: ఆ బాధ నాకు జీవితాంతం ఉంటుంది: ఆమని
- 90లలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆమని
- చిరంజీవితో కలిసి నటించలేకపోయానన్న నటి
- 'రిక్షావోడు'లో అవకాశం వచ్చినా కుదరలేదని ఆవేదన
అలనాటి స్టార్ హీరోయిన్ ఆమని పేరు చెప్పగానే 90ల నాటి హిట్ సినిమాలు వెంటనే గుర్తుకొస్తాయి. 1992లో విడుదలైన ‘జంబలకిడిపంబ’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆమని, తొలి చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత ‘మిస్టర్ పెళ్లాం’, ‘శుభలగ్నం’, ‘మావిచిగురు’, ‘శుభ సంకల్పం’ వంటి విభిన్నమైన కథలతో వచ్చిన సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా ‘మిస్టర్ పెళ్లాం’ సినిమాలో ఆమె పోషించిన పాత్రకు గానూ ప్రతిష్ఠాత్మక నంది అవార్డు దక్కడం ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఆమని, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, టీవీ సీరియల్స్‌లో కూడా నటిస్తూ తన నటనతో మెప్పిస్తున్నారు.
ఇదిలా ఉంటే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని తన మనసులోని ఓ తీరని కోరికను బయటపెట్టారు. ఆమె మాట్లాడుతూ... “'శుభలగ్నం', 'మిస్టర్ పెళ్లాం'లాంటి సినిమాల్లో మంచి పాత్రలు చేయగలిగినందుకు గర్వంగా ఉంది. కానీ నా కెరీర్‌లో ఒక బాధ మాత్రం ఎప్పటికీ మిగిలిపోయింది. అదే మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించలేకపోవడం” అని భావోద్వేగంగా చెప్పారు. చిన్నప్పటి నుంచే చిరంజీవి తనకు ఎంతో ఇష్టమైన హీరో అని, ఆయన పక్కన హీరోయిన్‌గా నటించాలన్న కల ఎన్నో ఏళ్లుగా తనలో ఉందని వెల్లడించారు.
ఆమని చెప్పిన వివరాల ప్రకారం... ‘శుభలగ్నం’ తర్వాత చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రిక్షావోడు’ సినిమాలో ఆమెకు హీరోయిన్‌గా అవకాశం వచ్చిందట. డేట్స్ కూడా ఖరారయ్యాయని, షూటింగ్‌కు కొన్ని రోజుల ముందు చిరంజీవితో మాట్లాడిన సందర్భం కూడా ఉందని తెలిపారు. అయితే ఆ సమయంలో ఆ చిత్రానికి దర్శకుడు కోదండరామిరెడ్డి స్థానంలో కోడి రామకృష్ణ రావడంతో, తన స్థానంలో నగ్మాను తీసుకున్నారని పత్రికల్లో వార్తలు వచ్చాయని చెప్పారు. ఆ విషయం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని, చిరంజీవితో సినిమా చేయలేకపోవడం జీవితాంతం బాధగా మిగిలిపోతుందని ఆమని ఆవేదన వ్యక్తం చేశారు.