Pawan Kalyan: గిరిజన మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నూతన సంవత్సర కానుక

Pawan Kalyan Announces New Blood Bank for Tribal Women
  • అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా గత ఏప్రిల్‌లో కురిడీ గ్రామంలో పర్యటించిన పవన్ కల్యాణ్
  • రక్తహీనత కారణంగా గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు తెలుసుకున్న వైనం
  • సమస్య పరిష్కారానికి అరకులో ఆధునిక బ్లడ్ బ్యాండ్ భవనం నిర్మిస్తున్నామన్న పవన్ కల్యాణ్
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మన్యం ప్రాంత గిరిజనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక కానుక ప్రకటించారు. గిరిజన మహిళలను గర్భస్రావాలు, రక్తహీనత వంటి ప్రాణాంతక సమస్యల నుంచి కాపాడే లక్ష్యంతో అరకులోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఆధునిక బ్లడ్ బ్యాంక్ భవనం నిర్మించనున్నట్లు వెల్లడించారు.

'అడవితల్లి బాట' కార్యక్రమం ప్రారంభోత్సవానికి గత ఏప్రిల్‌లో పవన్ కల్యాణ్ వెళ్లిన సందర్భంగా కురిడీ గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించారు. ఆ సమయంలో ఒక గిరిజన మహిళ రక్తహీనత కారణంగా గిరిజనులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆరోగ్య సమస్యలను పవన్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా జన్యుపరంగా వచ్చే సికిల్ సెల్ అనీమియా వ్యాధి గర్భిణుల ప్రాణాలకు ముప్పుగా మారుతోందని వివరించారు.

ఈ సమస్యకు తప్పకుండా పరిష్కారం చూపుతానని అప్పుడే హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం.. అనంతరం సికిల్ సెల్ అనీమియా నివారణపై వైద్య నిపుణులతో చర్చించారు. వారసత్వంగా వచ్చే ఈ వ్యాధి తీవ్రతను రక్తమార్పిడి ద్వారా నియంత్రించవచ్చని నిపుణులు సూచించడంతో, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

నూతన సంవత్సర కానుకగా బ్లడ్ బ్యాంక్ భవన నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ భవనంలో అవసరాలకు అనుగుణంగా రక్తాన్ని నిల్వ చేసుకునేందుకు అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమైన నిధులను పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు దాతలు సమకూర్చనున్నారు.

త్వరలోనే భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అరకులోని ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానం చేస్తామని పవన్ తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 1,500 మంది సికిల్ సెల్ అనీమియా బాధితులకు మేలు జరగనుంది. 
Pawan Kalyan
Pawan Kalyan blood bank
Araku blood bank
Sickle cell anemia
Andhra Pradesh health
Tribal health
Blood donation
Alluri Sitarama Raju district
Pawan Kalyan news
AP Deputy CM

More Telugu News