Faisal Karim Masud: నేను దుబాయ్ లో ఉన్నా.. హాదీ హత్య బంగ్లాదేశ్ రాజకీయ కల్పితం: కరీం మసూద్
- ఉస్మాన్ హాదీ హత్య కేసులో కీలక మలుపు
- హాదీ హత్యతో తనకు సంబంధం లేదన్న కరీం
- బంగ్లాదేశ్ లో తన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని మండిపాటు
బంగ్లాదేశ్ విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ హత్య కేసులో తాజాగా ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్న ఫైసల్ కరీం మసూద్ మాట్లాడుతూ... తనకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని బహిరంగంగా ఖండించాడు. తాను ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నానని, భారత్‌లో ఉన్నానన్న బంగ్లాదేశ్ పోలీసుల ఆరోపణలు పూర్తిగా అసత్యమని పేర్కొన్నాడు. ఈ విషయమై సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోలో ఫైసల్ స్పందించాడు. అయితే ఆ వీడియో నిజమా? కాదా? అన్నదానిపై ఇంకా అధికారిక ధృవీకరణ జరగలేదు.
వీడియోలో మాట్లాడిన ఫైసల్ కరీం మసూద్... “హాదీ హత్య కేసు పూర్తిగా కల్పితమైనది. రాజకీయ కుట్రలో భాగంగానే నన్ను ఇరికించారు. ఈ తప్పుడు కేసు కారణంగా దేశం విడిచి దుబాయ్‌కు రావాల్సి వచ్చింది. నా వద్ద ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ దుబాయ్ వీసా ఉన్నా కూడా, ఇక్కడికి రావడం నాకు చాలా కష్టంగా మారింది” అని చెప్పాడు. అంతేకాదు, ఈ కేసులో తన కుటుంబ సభ్యులను కూడా లేనిపోని ఆరోపణలతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
హాదీతో తనకు ఉన్న సంబంధాలపై కూడా ఫైసల్ వివరించాడు. తాను ఐటీ వ్యాపారవేత్తనని, గతంలో బంగ్లాదేశ్ ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేశానని తెలిపాడు. ఉద్యోగ అవకాశాల విషయమై హాదీని కలవడానికి అతని కార్యాలయానికి వెళ్లానని, ఆ సందర్భంగా ఉద్యోగం ఇప్పిస్తానని హాది చెప్పడంతో రూ.5 లక్షల టాకా అడ్వాన్స్‌గా ఇచ్చానని వెల్లడించాడు. అంతేకాదు, హాదీ నిర్వహించే కార్యక్రమాలకు విరాళాలుగా కూడా పలుమార్లు డబ్బులు ఇచ్చినట్లు చెప్పాడు. హత్యకు ముందు శుక్రవారం కూడా ఒక కార్యక్రమానికి డబ్బు ఇచ్చానని తెలిపాడు.
ఈ ఘటన వెనుక జమాత్-ఇ-ఇస్లామీకి చెందిన తీవ్రవాద శక్తులే ఉన్నాయని ఫైసల్ ఆరోపించాడు. హాదీ కూడా జమాత్ నేపథ్యం నుంచి వచ్చినవాడేనని, అతడిని అదే శక్తులు హత్య చేశాయని పేర్కొన్నాడు. తాను గానీ, తన తమ్ముడు గానీ ఆ రోజు బైక్‌పై లేమని, ఉద్దేశపూర్వకంగా తమపై కేసు బనాయించారని ఆరోపించాడు.
మరోవైపు, బంగ్లాదేశ్ పోలీసులు మాత్రం ఫైసల్ కరీం మసూద్, ఆలంగీర్ షేక్ అనే ఇద్దరు నిందితులు దేశం విడిచి భారత్‌లోకి పారిపోయారని చెబుతున్నారు. మేఘాలయ సరిహద్దు మార్గంగా భారత్‌లోకి ప్రవేశించారని, ప్రస్తుతం భారత భూభాగంలోనే ఉన్నారని బంగ్లా మీడియా కథనాలు ప్రచారం చేశాయి. అయితే ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. హాదీ హత్యకు భారత్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఇది తీవ్రవాద శక్తులు సృష్టించిన తప్పుడు కథనమని స్పష్టం చేసింది.
ఇక ఉస్మాన్ హాదీ హత్య విషయానికి వస్తే... గతేడాది బంగ్లాదేశ్‌లో జరిగిన విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన హాదీ, డిసెంబర్ 12న ఢాకాలో గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో మరణించాడు. తలకు తూటా తగలడంతో తీవ్రంగా గాయపడ్డ హాదీని, చికిత్స కోసం సింగపూర్ తరలించగా ఆరు రోజుల తర్వాత మృతి చెందాడు. అతడి మరణానంతరం ఢాకాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పలు మీడియా సంస్థల కార్యాలయాలు, సాంస్కృతిక సంస్థలు దగ్ధమయ్యాయి
మొత్తానికి, ఫైసల్ విడుదల చేసిన వీడియో, పోలీసులు చేస్తున్న ఆరోపణలు, భారత్ ఇచ్చిన స్పష్టీకరణలతో ఈ కేసు మరింత క్లిష్టంగా మారింది. అసలు నిజం ఏమిటన్నది తేలాలంటే దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే అన్న అభిప్రాయం రాజకీయ, సామాజిక వర్గాల్లో వినిపిస్తోంది.