Vladimir Putin: పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి... వీడియో రిలీజ్ చేసిన రష్యా

Putin Residence Drone Attack Video Released by Russia
  • పుతిన్ నివాసంపై డ్రోన్ల దాడి జరిగిందన్న రష్యా
  • ఆధారాలంటూ వీడియోను విడుదల చేసిన రక్షణ శాఖ
  • ఇదంతా పచ్చి అబద్ధమని కొట్టిపారేసిన జెలెన్‌స్కీ
  • రష్యా ఆరోపణలపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఘర్షణలకు ముగింపు పలికేందుకు శాంతి చర్చలు జరుగుతున్న కీలక సమయంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగత నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడికి ప్రయత్నించిందని రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీని రష్యా రక్షణ శాఖ బుధవారం విడుదల చేసింది.

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపిన వివరాల ప్రకారం.. నోవ్‌గొరొడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసంపై డిసెంబర్ 28 రాత్రి నుంచి 29 సోమవారం తెల్లవారుజాము వరకు ఉక్రెయిన్ 91 దీర్ఘశ్రేణి డ్రోన్లతో దాడికి పాల్పడింది. అయితే రష్యా రక్షణ వ్యవస్థలు వాటన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టాయని, నివాసానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఆయన పేర్కొన్నారు. దీనిని ఉగ్రదాడి గా అభివర్ణించిన లావ్రోవ్.. సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. రష్యా విడుదల చేసిన వీడియోలో మంచుతో కప్పబడిన అటవీ ప్రాంతంలో కూలిన డ్రోన్ శకలాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. శాంతి చర్చలను పక్కదారి పట్టించేందుకే రష్యా ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఉక్రెయిన్ ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లేవని ఆ దేశ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా రష్యా ఆరోపణలకు తగిన సాక్ష్యాలు లేవని విశ్లేషిస్తున్నాయి.

ఈ పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యక్షుడి నివాసాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరమని, శాంతి స్థాపనకు దౌత్యమే సరైన మార్గమని ఆయన సూచించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడి ఈ ఘటనపై స్పందించారు. తాజా పరిణామాలు జరుగుతున్న శాంతి చర్చలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Vladimir Putin
Putin drone attack
Russia Ukraine war
Ukraine drone strike
Sergei Lavrov
Volodymyr Zelensky
Russia defense
Narendra Modi
Donald Trump

More Telugu News